Israel Defeat Iran: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్దం మరో స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల అనంతరం ఇరాన్‌ను దెబ్బకు దెబ్బ తీసేందుకు ఇజ్రాయెల్ సిద్దమైంది. ఇరాన్ చమురు క్షేత్రాలు, అణుకేంద్రాలపై దాడి చేసే అవకాశాలు ఉందంటూ అంతర్జాతీయ వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్ మిత్ర దేశం అమెరికా అణు కేంద్రాలపై దాడులు వద్దంటూ వారిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకపడే అవకాశం మాత్రం సుస్పష్టం. ఈ విషయంలో అమెరికా అడ్డం చెప్పినా  ఇజ్రాయెల్ ఏ మాత్రం పట్టించుకోదన్న విషయం చరిత్ర చెప్పే సత్యం. ఈ తరుణంలో ఇజ్రాయెల్ - ఇరాన్ ఏయే యుద్దాల్లో ఇంతకు ముందు పాల్గొన్నాయి. వాటి ఫలితాలేంటో పరిశీలిద్దాం.


ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన నాటి నుంచే అనేక యుద్దాల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. చేసిన అన్ని యుద్దాల్లో కొంత పై చేయి సాధించిందనే చెప్పాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ చేసిన యుద్దాల్లో అరబ్ దేశాలతో చేసిన యుద్దాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు.


1. ఇజ్రాయెల్ - అరబ్ దేశాల యుద్దం ( 1948 -49).


ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడింది 1948 మే 14న. ఇజ్రాయెల్ దేశం ఉన్న ప్రాంతాన్ని బ్రిటిషర్లు విడిచిపెట్టిన వెంటనే యూదులు దేశాన్ని ప్రకటించుకున్నారు. దీన్ని  అరబ్ దేశాలు అంగీకరించలేదు. సిరియా, ఈజిప్టు,  జోర్డాన్, ఇరాక్, లెబనాన్ దేశాలు ఇజ్రాయెల్ పైకి దాడికి దిగాయి. దీంతో ఇజ్రాయెల్ కూడా ఈ దేశాలపై ఎదురుదాడికి దిగింది. దీన్ని యూదులు స్వాంత్రోద్యమ సమరంగా పిలుచుకుంటారు. ఈ యుద్దంలో ఇజ్రాయెల్ పై చేయి సాధించి ఈ అరబ్ దేశాల ను  వెనక్కు నెట్టింది.  ఈ యుద్దం కారణంగా ఇజ్రాయెల్ అప్పటి వరకు ఐక్య రాజ్య సమితి  ఇచ్చిన భూబాగం కంటే ఎక్కువ భూబాగాన్ని స్వాధీనం చేసుకుంది. పశ్చిమ జెరుసలేం, గలలీయ ప్రాంతం ఇజ్రాయెల్ పరమైంది. దాదాపు 7 లక్షల మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు.


2. సూయజ్ కాలువ కోసం జరిగిన యుద్దం - ఈ యుద్దానికి కారణం ఈజిప్టు సూయజ్ కాలువను జాతీయం చేసింది. దీంతో బ్రిటన్, ఫ్రాన్స్ సరుకు రవాణాకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో తమ ప్రతిష్ట దిగజారిపోకుండా ఉండేందుకు ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్ సాయంతో  ఈజిప్టుపై దాడికి పథక రచన చేశాయి. ముందుగా సినాయి ఏడారిలోని మిట్లా పాస్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.  ఇజ్రాయెల్ - ఈజిప్టు మధ్య తీవ్ర పోరు జరిగింది. మరుసటి రోజే ఇది తమకు తెలియకుండా జరిగిన దాడి అంటూ బ్రిటన్ - ప్రాన్స్‌లు యుద్దం ఆపాలని ఇరుదేశాలను హెచ్చరించాయి. దీంతో  ఈజిప్టు తన బలగాలను యుద్దం నుంచి వెనక్కు రప్పించింది. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సూయజ్ కాలువ విషయంలో పెట్టిన డిమాండ్లకు  ఈజిప్టు అధ్యక్షుడు నాజర్ అంగీకరించకపోవడంతో రెండు యూరప్ దేశాలు ఈజిప్టు పై వైమానిక దాడులు చేసి వారి విమానాశ్రాయలను స్వాధీనం చేసుకున్నారు. అదే రీతిలో సూయజ్ కాలువను స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ఈ యుద్దానికి  అటు  ఐక్యరాజ్య సమితి నుండి,  అమెరికా నుండి మద్ధతు లేదు.  అంతర్జాతీయంగాను, అమెరికా నుంచి ఒత్తిడి కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీంతో యుద్దంలో  ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్‌లు గెలిచినా, వరల్డ్ పాలిటిక్స్‌లో మాత్రం ఇదో  ఓటమిగా చెప్పుకొంటారు. తిరిగి సూయజ్ కాలువ ఈజిప్టు పరిధిలోకే వచ్చింది. యుద్దం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు  మిడిల్ ఈస్ట్‌లో తమ ప్రాబల్యం కోల్పోయాయి. అమెరికా, సోవియట్ యూనిట్లు ఆ స్థానాలను నిలబెట్టుకోన్నాయి.


3. 1967: ఆరు రోజుల యుద్ధం, ఇజ్రాయెల్  బలానికి గుర్తుగా ఈ విజయాన్ని చెప్పుకొంటారు. 1967 జూన్ 5వ తేదీ నుంచి 1967 జూన్ పదో తేదీ వరకు ఈ యుద్దం ఆరు రోజుల్లోనే ముగిసింది. ఇది చాలా వేగవంతమైన యుద్దంగా మిలిట్రీ పాఠాల్లో చెప్పుకొంటారు. ఈ యుద్దానికి కారణం ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాలకు ఉన్న విబేధాలే ప్రధాన కారణం. ఈజిప్టు నాయకత్వంలో సిరియా, జోర్డాన్, ఇరాక్  దేశాలు పాల్గొన్నాయి. మరి కొన్ని అరబ్ దేశాలు పరోక్ష మద్ధతును ఇచ్చాయి.  ఈజిప్టు యుద్ద సన్నహాలను గమనించిన  ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రణాళికను అమలు చేసింది. ఈజిప్టు,సిరియా, జోర్డాన్, ఇరాక్ దేశాల యుద్ద సన్నాహాలు, వారి శక్తిని తట్టుకోవాలంటే ముందుగా వారిని ఊహించని రీతిలో న్యూట్రలైజ్ చేయాలన్న నిర్ణయానికి ఇజ్రాయెల్ వచ్చింది. యుద్ధాన్ని తానే ముందుగా ప్రారంభించింది. 1967 జూన్ ఐదో తేదీన ఆపరేషన్ ఫోకస్ పేరుతో   ఈజిప్టు విమానశ్రయంపై దాడులు చేసింది. యుద్ద విమానాలను  ధ్వంసం చేసింది. కొన్ని గంటల్లోనే  ఈ విధ్వంసాన్ని ఇజ్రాయెల్ పూర్తి చేయడంతో ప్రపంచం అవాక్కయింది.  ఆ తర్వాత జోర్డాన్, సిరియా, ఇరాక్ లపై ఇదే వ్యూహాన్ని అమలు చేసి విజయవంతం అయింది. దీంతో యుద్దంలో ఉన్న అరబ్ దేశాల గగన తలంపై ఇజ్రాయెల్ ఆధిపత్యం పొందగలిగింది. ఆ తర్వా భూతల దాడులకు దిగిన  యూదు సైన్యం  దూకుడుగా  దూసుకువెళ్లి శత్రుభూభాగాలను చిక్కించుకుంది.ఈ యుద్దంలో ఇజ్రాయెల్  ఈ జిప్టు నుండి సినాయి ద్వీపకల్పం, గాజా ప్రాంతాన్ని,  జోర్డాన్ నుండి పశ్చిమ తీర ప్రాంతాన్ని,  తూర్పు జెరుసలేం ప్రాంతాన్ని,  సిరియా నుండి గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని స్వాధీన చేసుకుని యుద్దంలో పై చేయి సాధించింది. ఈ యుద్ధంలో అరబ్ కూటమి దేశాలను ఓడించడంతో ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ లో శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది.


4. 1973: యోమ్కిప్పూర్ యుద్దం -  ఈ యుద్దం యూదుల పవిత్రమైన రోజు. వారి క్యాలెండర్ ప్రకారం తిష్రే నెల పదవ తేదీన జరుపుకొంటారు.  యెమ్ కిప్పూర్ అంటే ప్రాయశ్చిత్త దినం. తమ పాపాలు పోవాలని యూదులంతా 25 గంటల పాటు కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. 1973లో సరిగ్గా  అదే రోజు అక్టోబర్ ఆరో తేదీన, ఈజిప్టు, సిరియాలు 1967 యుద్దంలో కోల్పోయిన తమ భూబాగాన్ని  పొందేందుకు  ఇజ్రాయెల్ పై దాడి చేశాయి.  అందుకే ఈ యుద్దానికి యెమ్ కిప్పూర్ యుద్దంగా పిలుస్తారు. మొదటగా ఈ యుద్దంలో సిరియా, ఈజిప్టులు ఇజ్రాయెల్ పై పై చేయి సాధించాయి. సినాయి ద్వీకల్పాన్ని ఈజిప్టు తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సిరియా గోలాన్ హైట్స్ పై దాడి చేసింది.  ఈ యుద్దంలో విజయం దిశగా వెళ్తున్నామని సిరియా, ఈజిప్టు భావిస్తున్న తరుణంగా తిరిగి ఇజ్రాయెల్ బలంగా యుద్దం చేసి  రెండు అరబ్ దేశాలను వెనక్కు నెట్టింది. తిరిగి  ఆ రెండు ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. దీంతో  ఈ రెండు దేశాలు ఓటమి చెందక తప్పలేదు. ఈ యుద్దం తర్వాత  కాంప్ డేవిడ్  ఒప్పందం ద్వారా ఈజిప్టు  ఇజ్రాయెల్ తో శాంతి  ఒప్పందం కుదుర్చుకుంది. తిరిగి తన సినాయి పెన్సులాను తను తిరిగి పొందగలిగింది.


5. లెబనాన్‌తో యుద్ధాలు: ఇజ్రాయెల్ ఆ తర్వాత లెబనాన్‌తో యుద్దం చేయాల్సి వచ్చింది. 1970 నుంచి 2000 సంవత్సరం వరకు మూడు యుద్దాలు  జరిగాయి.  1970ల్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేయసాగింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ దక్షిణ ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చి పీఎల్ వో కార్యకలాపాలను అణిచివేసింది. ఇందుకు కొంతకాలం ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోనే మకాం వేసింది. ఆ తర్వాత  ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని తమ శాంతి దళాలను అక్కడ మొహరించడంతో  ఇజ్రాయెల్ సైన్యం వెనక్కు వచ్చింది. తిరిగి 1982లోను ఇరు దేశాల మధ్య వార్ నడిచింది. అయితే యుద్దం అనడం కన్నా దీన్నిరైట్ 2 ఆపరేషన్ గా పిలుస్తారు. లెబనాన్ లోని పాలస్తీనా తీవ్రవాద సంస్థలను అదుపు చేయడానికి చేసిన ఆపరేషన్. బీరూట్, సహా దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకొని వచ్చి పాలస్తీనా తీవ్రవాద సంస్థల నాయకులను, సంస్థ కార్యకలాపాలను న్యూట్రలైజ్ చేయడం జరిగింది. దీంతో పాలస్తీనా తీవ్రవాద సంస్థల ప్రభావాన్ని ఈ  ఆపరేషన్ తగ్గించగలిగింది. కాని హిజ్బు్ల్లా వంటి దేశీయ సంస్థ పురుడుపోసుకోవడానికి కారణమయిందని చరిత్ర కారులు చెబుతారు.


6. 2006లో లెబనాన్‌తో యుద్ధం: 2006 జులై 12న ప్రారంభమైన యుద్దం 2006 ఆగష్టు 14వ తేదీ వరకు దాదాపు 34 రోజుల పాటు జరిగింది. లెబానాన్ కు చెందిన హిజ్బుల్లా ఉగ్ర సంస్థను కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లో అడుగుపెట్టింది.  హిజ్బుల్లా షియా మతానికి చెందిన ఉగ్రవాద సంస్థ. ఇది పాలస్తీనా డిమాండ్ కు  పూర్తి మద్ధతుదారు. 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్ సైన్యం తమ దేశ సరిహద్దు ప్రాంతమైన సౌత్ లెబనాన్ వీడిన తర్వాత ఈ సంస్థ అక్కడ బలపడింది. 2006లో ఇజ్రాయెల్ సైన్యంపై దాడి చేసిన హిజ్బుల్లా ఇద్దరు సైనికులను అహరించింది. దీంతో యూదు సైన్యం వారిని వెతుకుతూ లెబనాన్ లోకి అడుగుపెట్టారు.  హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఆర్మీపై రాకెట్లతో దాడి చేయగా, ట్యాంకులు, యుద్ద విమానాలతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. లెబనాన్ లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.  ఐక్య రాజ్య సమితి జోక్యంతో ఈ యుద్దం 34 రోజుల తర్వాత ముగిసింది.


7. గాజాతో యుద్ధాలు:  ఇజ్రాయెల్ గాజాతో పలు యుద్దాలు చేసింది. యుద్దం కన్నా ఆపరేషన్లు అనడం సబబు. గాజా పాలస్తీనాలోని ఓ ప్రాంతం.  హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పై జరిపే దాడుల కారణంగా  ఈ యుద్దాలు చేయాల్సి వచ్చింది. అందులో 2008-2009లో ఆపరేషన్  కాస్ట్ లీడ్ పేరుతో గాజాపై  ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేసింది. 2005లో గాజా బ్లాకులను ఇజ్రాయెల్ సైన్యం విడిచిపెట్టడంతో అక్కడ హిజ్బుల్లా తో పాటు హమాస్ ఇతర ఉగ్రవాద గ్రూపుల ప్రబావం పెరిగింది. 2006 లెబనాన్ వార్ తర్వాత గాజా నుండి ఇజ్రాయెల్ పై దాడులు పెరిగాయి. దీంతో వీటిని అడ్డుకునేందుకు  ఇజ్రాయెల్ ఆపరేషన్ కాస్ట్ లీడ్ పేరుతో సైనిక ఆపరేషన్ నిర్వహించింది.  ఆ తర్వాత 2012లో ఆపరేషన్ పిల్లర్ ఆఫ్ డిఫెన్స్  పేరుతో  ఇజ్రాయెల్ మరో సారి గాజాపై దాడి చేసింది.  గాజానుండి రాకెట్ దాడులను హామాస్ చేయడంతో  ఆ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేసింది. 2014 జూన్ లో ఇజ్రాయెల్ యువకులను  పాలస్తీనా ఉగ్ర సంస్థలు కిడ్నాప్ చేయడంతో   భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో 2 వేలకు పైగా పాలస్తీనియన్లు, దా దాపు 73 మంది యూదులు మృతి చెందారు. 2021లో జెరుసలేం దగ్గరలోని కుద్రత్ లోని పాలస్తీనియన్లను తరలించాలని ఇజ్రాయెల్ ప్రణాళికను నిరసిస్తూ పాలస్తీనియన్లు అల్లర్లకు దిగారు. అదే సమయంలో ఈ అల్లర్ల కారణంగా హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు దిగింది. దీంతో ఇజ్రాయెల్ గాజాపై ఎయిర్ స్ట్రైక్ కు దిగింది. ఇక 2023 లో ఇజ్రాయెల్ గాజాపై  ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ పేరుతో భారీ యుద్దానికి దిగింది. 2023 ఆక్టోబర్ 7వ తేదీన  హమాస్ సంస్థ మెరుపు దాడికి దిగి ఇజ్రాయెల్ ప్రజలను ఊచకోత కోసింది. కొందరిని బందీలుగా చెరపట్టింది. దీంతో హమాస్ సంస్థను రూపుమాపే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఇప్పటికీ ఈ ఆపరేషన్ సాగుతోంది.  ఈ ఆపరేషన్ వల్ల లక్షలాది మంది పాలస్తీనా ప్రజలు గాయపడ్డారు. వేలాది మంది మృత్యవాత పడ్డారు.  గాజాలో పరిస్థితి దారుణంగా మారింది.  అంతే కాకుడా హమాస్ ముఖ్యనేతలందరినీ ఒక్కోక్కరిగా మట్టుబెడుతూనే ఉంది.


8. 2024 ఇరాన్‌తో - అయితే  ఇప్పుడు ఇరాన్‌తో ఇజ్రాయెల్ యుద్దానికి సిద్దమైంది. రెండు బలమైన దేశాల మధ్య యుద్దం ఇప్పుడు ప్రపంచానికి తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్ వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అయితే ఇజ్రాయెల్ తన ఐరన్ డ్రోమ్‌తోను, అమెరికా ఇంటర్ సెప్టర్ రాకెట్లతో ఇరాన్ రాకెట్లను అడ్డుకుంది. అయితే కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. తమకు హాని కలిగిస్తారన్న అనుమానం వస్తేనే వదలని ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ నేరుగా దాడి చేస్తుంటే చూస్తూ ఊర్కోదని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. భారీ స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతుందన్న ప్రచారం సాగుతోంది.  ఇరాన్ చీఫ్ అయతుల్లా ఖోమైనీని టార్గెట్  చేస్తూందా లేక ఇరాన్ చముకు క్షేత్రాలను ధ్వంసం చేస్తుందా.? అదీ కాక అణు కేంద్రాలపై దాడులు చేస్తుందా.? అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. అయితే అమెరికా అణు కేంద్రాలపై దాడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నా.. అనూహ్య దాడులకు ఇజ్రాయెల్ ప్రసిద్ధి. తమ దేశ రక్షణ విషయంలో ఏ దేశ సలహా పట్టించుకోని చరిత్ర ఉంది. ప్రస్తుతం తనపై ఇరాన్ దాడిని సాకుగా చూపెట్టి తమ భద్రతకు సవాల్ గా  ఉన్న ఇరాన్ అణు సామర్థ్యం దెబ్బతీసే విషయంలో ఇజ్రాయెల్ రాజీ పడదన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్దాల్లో సైనిక విజయాలు సాధించిన ఇజ్రాయెల్ ఇప్పుడు  ఇరాన్ లాంటి  సైనిక పాటవం, అంతర్జాతీయ మిత్రులు ఉన్న దేశంతో ఎలాంటి యుద్దానికి సిద్ధమవుతుందా ఆ పరిణామాలు ఎలా మారతాయా అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ - ఇజ్రాయెల్ నేతల మధ్య మాత్రం మాటల తూటాలు సాగుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఎలా చేస్తుందో.. దానికి ప్రతిగా ఇరాన్ జవాబు ఎలా ఇస్తుందో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.