Israel-Hezbollah War: శుక్రవారం (సెప్టెంబర్ 27) లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. హెవీ గైడెడ్ బాంబు ప్రయోగించినట్టు సమాచారం. ఈ దాడితో బీరూట్ పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా షేక్ అయినట్టు చెబుతున్నారు. హిజ్బుల్లా ప్రధాన కార్యాలయం టార్గెట్‌గా చేసిన దాడిలో ఆ భవనం ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
బాంబు దాడులతో దద్దరిల్లి బీరూట్
ఈ దాడి అనంతరం ఆ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు కనిపిస్తోంది. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంలోనే ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించింది. అందుకే బాంబులతో మెరుపు దాడి చేసిందని తెలుస్తోంది. ఈ బాంబు దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది.
హసన్ నస్రల్లా సేఫ్ అంటున్న హిజ్బుల్లా కానీ..
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆరు భవనాలు నేల కూలాయి. అయినా హసన్ నస్రల్లాకు ఎలాంటి హాని జరగలేదని హిజ్బుల్లా ప్రకటించింది. శిథిలాల తొలగింపు కొనసాగుతోందని మృతుల సంఖ్య మాత్రం భారీగా ఉన్నట్టు చెబుతోంది. ప్రస్తుతానికి 9 మంది చనిపోయారని... వంద మంది వరకు గాయపడ్డారని రిపోర్ట్ అవుతోంది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ... బీరూట్‌లో దక్షిణ శివారులో ఉన్న హిజ్బుల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. అని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా బీరూట్ ప్రాంతంలోని హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దళం దాడి చేసింది. ఈ భవనాల్లో ఆయుధాలు తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆయుధాలు స్టోర్ చేస్తున్నారు. ఇక్కడే ఉగ్రవాద సంస్థ ప్రధాన కమాండ్ సెంటర్ కూడా ఉంది. వీటిని లక్ష్యంగా చేసుకున్నామని... వివరించారు. ఆ దాడిలో హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్ ముహమ్మద్ అలీ ఇస్మాయిల్, అతని డిప్యూటీ హుస్సేన్ అహ్మద్ ఇస్మాయిల్ చనిపోయినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Also Read: సేమ్ సెక్స్ మారేజెస్‌కు థాయిలాండ్ రాజముద్ర - ఎల్‌జీబీటీల కోసం చట్టం చేసిన తొలి పశ్చిమాసియా దేశం
విమాన సర్వీసులు రద్దు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు అత్యవసర సమావేశం నిర్వహించారు. లెబనాన్‌లో వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుసుకున్న అయతుల్లా అలీ ఖమేనీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం తర్వాత బీరూట్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను ఇరాకీ ఎయిర్‌వేస్ నిలిపివేసింది. "లెబనాన్‌లో క్షీణిస్తున్న శాంతి భద్రత" కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాక్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలు వందల మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు రాకెట్‌లతో హిజ్బుల్లా ప్రతిదాడులు చేస్తోంది. దీంతో రోజు రోజుకు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
Also Read: చైనా సైనిక సన్నద్ధతకు భారీ ఎదురు దెబ్బ.. సముద్రంలో మునిగిన ప్రతిష్ఠాత్మక న్యూక్లియర్ సబ్‌మెరైన్