Thai king signs same-sex marriage bill: థాయిలాండ్‌లో ఇకపై స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు చేసిన బిల్లుపై థాయిలాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ సంతకం చేశారు. 2025 జనవరి నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. థాయిలాండ్ రాజముద్ర పడడంతో బ్యాంగ్‌కాక్‌లోని ఎల్‌జీబీటీలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.






జనవరి 22న వెయ్యి ఎల్‌జీబీటీ వివాహాలకు ఏర్పాట్లు:


సేమ్‌ సెక్స్ మారేజెస్‌కు అనుమతించిన తొలి పశ్చిమాసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. ఆసియా దేశాల్లో తైవాన్‌, నేపాల్ ఇప్పటికే ఎల్‌జీబీటీ మ్యారేజెస్‌ను చట్టబద్ధం చేస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. థాయిలాండ్‌లో ఇప్పటికే ఎల్‌జీబీటీల వివాహ హక్కులకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించి రాజముద్ర కోసం పంపింది. బుధవారం (సెప్టెంబర్‌ 24) నాడు థాయిలాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ సంతకం చేసిన బిల్లును రాయల్ గెజిట్‌లో పబ్లిష్ చేశారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి 120 రోజులు పడుతుంది. అంటే జనవరి 22, 2025 నుంచి థాయిలాండ్‌లో ఎల్‌జీబీటీల వివాహాలు చట్టబద్ధం అవుతాయి.


రాయల్‌ గెజిట్‌లో కొత్త చట్టాన్ని పబ్లిష్ చేసిన వేళ బ్యాంగ్‌కాక్‌లో ఎల్‌జీబీటీలు సంబరాలు చేసుకున్నారు. ముఖాలపై రంగులు, గోడలపై డూడుల్స్ రూపంలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలుతో సాదారణ భార్యాభర్తల మాదిరే వీరికి కూడా పిల్లలను అడాప్ట్‌ చేసుకునే హక్కులతో పాటు మరికొన్ని రానున్నాయి. హస్‌బెండ్స్‌, వైవ్స్‌, మెన్‌, విమెన్‌ ప్లేస్‌లో జెండర్ న్యూట్రల్‌ టర్మ్స్ వాడడానికి అనుమతి ఉంటుంది. ఈ చట్టం రాకతో మ్యారేజ్‌ సర్టిఫికెట్లపై పేర్లతో పాటు కొత్త చరిత్ర కూడా రాశామని ఎల్‌జీబీటీ యాక్టివిస్ట్‌ అన్‌ చుమ్‌పోన్ తెలిపారు. ఈ చట్టం అమలు సమానత్వ విజయంగా, మనుషుల గౌరవానికి సంబంధించిందిగా అన్ వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా ఎల్‌జీబీటీలు, సామాజిక కార్యకర్తలు సేమ్‌ సెక్స్ మ్యారేజెస్ చట్టబద్ధత కోసం పోరాడుతున్నారు. చట్టానికి రాజముద్ర పడిన వేళ థాయిలాండ్ ప్రధాని పాయ్‌టోంగ్‌ట్రాన్ షినవత్ర X వేదికగా లవ్‌ విన్స్ అనే యాష్‌ ట్యాగ్‌తో శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని శ్రేత్‌తవిసిన్ ఈ పోరాటానికి అప్పట్లోనే మద్దతు ఇచ్చారు. థాయిలాండ్ సమాజంలో ఈక్విటీ, ఈక్వాలిటీ భాగంగా మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. లింగ వైవిధ్యాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిన పరిస్థితులు వచ్చేశాయని చెప్పారు. జనవరి 22 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుండగా.. ఆ రోజున ఎల్‌జీబీటీలు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జనవరి 22న బ్యాంగ్‌కాక్‌లో జరిగే వేడుకల్లో దాదాపు వెయ్యి ఎల్‌జీబీటీ జంటలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు అన్‌ పేర్కొన్నారు.


పశ్చిమ దేశాల్లో ఎల్‌జీబీటీల వివాహాలకు మద్దతు ఉండడం సాదారణం. అయితే ఆసియా వంటి సంప్రదాయ దేశాల్లో ఇది అసాధ్యం. అలాంటిది ఐదేళ్ల క్రితం తైవాన్ ఈ తరహా చట్టంపై సంతకం చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. 2019లోనే ఎల్‌జీబీటీల మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించింది గతేడాది నవంబర్‌లో నేపాల్‌లో తొలి స్వలింగ సంపర్కుల మ్యారేజ్ రిజిష్టర్ ఐంది. నేపాల్ ఎల్‌జీబీటీలకు మద్దతుగా తీర్పు ఇచ్చిన 5 నెలల తర్వాత ఇది జరిగింది. భారత్‌లో మాత్రం సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని పార్లమెంటుకు వదిలేసింది. సింగపూర్‌ 2022లో సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు వ్యతిరేకంగా ఉన్న శతాబ్దాల నాటి చట్టాన్ని కొట్టి పారేసింది. అందుకు పెళ్లి నిర్వచనంలో మార్పుల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసింది.