OpenAI CTO Mira Murati Resigns: ఆరు సంవత్సరాలకు పైగా ఓపెన్‌ ఏఐలో కీలకంగా పని చేసిన మిరా మురాటి, 2017లో ఆ కంపెనీలో బాధ్యతలు చేపట్టారు. కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ టెంపరరీగా బయటకు వెళ్లినప్పుడు, కంపెనీ గందరగోళంలో పడింది. అలాంటి సమయంలో మిరా మురాటి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో ఫేమస్ అయిన మిరా మురాటి, సుమారు ఆరున్నర సంవత్సరాలు ఓపెన్‌ ఏఐలో ఉన్నారు. తన కోసం మరింత సమయం కేటాయించడం కోసం & తన గురించి తాను మరింత తెలుసుకోవడం కోసం రిజైన్‌ చేసినట్లు ఆమె చెప్పారు.


సోషల్‌ మీడియాలో లేఖ
చాట్‌జీపీటీని (ChatGPT) కంపెనీలో కీలకంగా మార్చడంలో, దానిని ముందుకు తీసుకెళ్లడంలో మిరా మురాటి పెద్ద పాత్ర పోషించారు. తన రాజీనామా, భవిష్యత్‌ ప్రయాణం గురించి చెబుతూ మిరా మురాటి సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ రాశారు. చాట్‌జీపీటీ ప్రాజెక్ట్‌ సహా కంపెనీతో తన ఆరున్నర సంవత్సరాలు చాలా బాగా గడిచాయని, అపూర్వమైన అధికారాలు లభించాయని రాశారు. సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక గొప్ప సాంకేతిక సంస్థకు నాయకత్వం వహించడంలో తనపై విశ్వాసం ఉంచిన సామ్ & గ్రెగ్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పారు. చాలా సంవత్సరాలు వారి నిరంతర మద్దతు లభించిందన్నారు. 


మిరా మురాటి గురించి తెలుసుకోవలసిన 9 విషయాలు:


1) మిరా మురాటి అల్బేనియాలో పుట్టి పెరిగింది. 16 సంవత్సరాల వయస్సులో, పియర్సన్ కళాశాలలో UWC కోసం కెనడా వెళ్లారు.


2) అమెరికాలోని ఐవీ లీగ్ డార్ట్‌మౌత్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్న రోజుల్లో ఆమె తన సీనియర్ ప్రాజెక్ట్ కోసం హైబ్రిడ్ రేస్ కారును తయారు చేశారు.


3) గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆపై జోడియాక్ ఏరోస్పేస్‌లో. ఆ తర్వాత, మోడల్ X కోసం టెస్లాలో మూడు సంవత్సరాలు పని చేశారు.


4) 2016లో సెన్సార్-బిల్డింగ్ స్టార్టప్ 'లీప్ మోషన్‌'లో ప్రొడక్ట్‌ అండ్ ఇంజినీరింగ్ VPగా చేరారు. రెండేళ్ల తర్వాత.. అప్లైడ్ AI, పార్టనర్‌షిప్స్‌ VPగా OpenAIలో చేరడానికి లీప్ మోషన్‌ను విడిచిపెట్టారు.


5) “నేను టెస్లాలో, లీప్ మోషన్‌లో ఉన్నప్పుడు వర్చవల్‌ వరల్డ్‌లో AI అప్లికేషన్స్‌ చేస్తున్నాను. మేం నిర్మించిన చివరి & అతి ముఖ్యమైన ప్రధాన సాంకేతికత AGI అని నేను చాలా గట్టిగా నమ్మాను” అని జులై 2023 ఇంటర్వ్యూలో చెప్పారు.


6) మురాటి 2018లో సంస్థలో చేరారు, అదే సమయంలో OpenAIలో సూపర్‌ కంప్యూటింగ్‌పై పని చేయడం ప్రారంభించారు. 2022లో, ఆమె చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు.


7) మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల చెప్పిన ప్రకారం, “టెక్నికల్‌ నాలెడ్జ్‌, ట్రేడ్‌, మిషన్‌ పట్ల లోతైన అవగాహన, టీమ్‌లను ఒకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఆమెకు ఉంది. ఫలితంగా, కొన్ని గొప్ప AI టెక్నాలజీలను రూపొందించడంలో ఆ కృషి సాయపడింది"


8) "మిరా గత ఆరున్నర సంవత్సరాలుగా OpenAI పురోగతి, వృద్ధికి కీలక పాత్ర పోషించారు. మా అభివృద్ధిలో ఆమె చాలా ముఖ్యమైన భాగం" అని రిజిగ్నేషన్‌ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మిరాటీ గురించి సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు.


9) మిరా రాజీనామా పట్ల తాను విచారంగా ఉన్నానని, అయితే ఆమె నిర్ణయానికి మద్దతు ఇచ్చానని కూడా సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు. "గత సంవత్సరంగా, కంపెనీ పురోగతిని కొనసాగించే బలమైన లీడర్స్‌ బెంచ్‌ను ఆమె నిర్మిస్తోంది" అని కూడా పేర్కొన్నారు.


మిరా మురాటీతో పాటు మరో ఇద్దరు టెక్నికల్ ఆఫీసర్లు కూడా ఓపెన్‌ ఏఐని విడిచిపెట్టారు.


మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్‌ పథకాల వడ్డీ రేట్ల సవరణ - పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి రేట్లు ఎంత మారొచ్చు?