Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి. గత ఐదు రోజుల్లో 3000 మందికి పైగా మరణించారు. ఎక్కడ చూసిన మృతదేహాలతో రెండు ప్రాంతాలు భీకరంగా కనిపిస్తున్నాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి.  అయినా ఇజ్రాయెల్, హమాస్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. గాజాపై దాడులను ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మందిని పిలిపించారు.  


గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ నివేదించింది. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతే కాకుండా ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ సాధించింది.


అమెరికా నుంచి 'అధునాతన' మందుగుండు సామగ్రితో మొదటి విమానం ఇజ్రాయెల్ నెవాటిమ్ వైమానిక స్థావరంలో దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మందుగుండు సామగ్రిని విస్తృత దాడులు, అదనపు పరిస్థితుల్లో ఉపయోగించనున్నట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది.  US ప్రభుత్వం ఇప్పటికే ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. అలాగే ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఎవరైనా అనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ దాడులను దుర్మార్గపు చర్యగా బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు అవసరమైతే అదనపు యుద్ధ సామగ్రి తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 


గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్లు పేల్చిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలో షెల్లింగ్ కూడా ప్రారంభించింది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ సిరియా నుంచి అనేక ప్రయోగాలు జరిగినట్లు గుర్తించామని, బహుశా అవి బహిరంగ ప్రదేశాల్లో పడిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సిరియా భూభాగం నుంచి పాలస్తీనా వర్గం రాకెట్ దాడి చేసిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. హిజ్బుల్లా గతంలో సిరియా నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడికి బాధ్యత వహించాడు.


US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌ సందర్శించే అవకాశం ఉంది . ఇజ్రాయెల్ ఉన్నత అధికారులతో సమావేశమవుతారు. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంఘీభావాన్ని ప్రకటిస్తారు. ఆ తరువాత బ్లింకెన్ పొరుగున ఉన్న జోర్డాన్‌ను కూడా ఆయన శుక్రవారం సందర్శించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇజ్రాయెల్, గాజాలో పౌరుల మరణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య యుద్ధం మధ్య ప్రాచ్యంలో యుఎస్ వైఫల్యాలకు నిదర్శనం అని ఆరోపించారు. పుతిన్ ఇరువర్గాలతో మాట్లాడుతున్నారని, వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాస్కో అధికారులు పేర్కొన్నారు.


ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా హమాస్ ఉగ్రవాదులను ఐసిస్‌తో పోల్చారు. వారిని అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో మూడోసారి మాట్లాడానని, ఐఎస్‌ఐఎస్ కంటే హమాస్ అధ్వాన్నంగా ఉందని వివరించినట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి హమాస్ ఉగ్రవాదులకు సహాయం చేశారనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ పరిస్థితికి ఇజ్రాయెల్‌ కారణమని ఇరాన్ మండిపడింది. 


గాజాపై ఇజ్రాయెల్ విధించిన సంపూర్ణ దిగ్బంధనం కొనసాగుతోంది. 2.3 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ప్రాంతానికి విద్యుత్, ఆహారం, ఇంధనం అందడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, వారి యుద్ధ విమానాలు రాత్రి పూట గాజాలో 200 పైగా హమాస్ ఉగ్రవాదులు ఉంటున్న భవనాలను కూల్చివేశాయి. UN డేటా ప్రకారం 1,80,000 పైగా గాజా ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది పాఠశాలల్లో తలదాచుకుంటున్నారు.