ఎటుచూసినా శిథిలాల కుప్పలు... తమవారి ఆచూకీ కోసం వెతుకుతున్న ప్రజలు.. సర్వస్వం కోల్పోయి నడిరోడ్డుపై నిలిచిన అభాగ్యులు... ఇవి ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌లో కనిపిస్తున్న దృశ్యాలు. శనివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు  గ్రామాలను గ్రామాలనే నాశనం చేసింది. నాటి విధ్వంసానికి, విషాదానికి అఫ్గాన్‌లో పరిస్థితులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ పశ్చిమ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. కానీ శనివారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 4 వేలు దాటిందని అప్ఘానిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి ముల్లా సైక్ తెలిపారు.  20 గ్రామాల్లో దాదాపు 2 వేల ఇళ్లు పూర్తిగా కూలిపోయాయని తెలిపారు.  మిలియన్ల విలువైన సహాయాన్ని ప్రకటించింది. అఫ్గానిస్థాన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఎక్కువగా విదేశీ సహాయంపై ఆధారపడడంతో వైద్యం చాలా ఆలస్యమవుతోంది.


అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది.  పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 


మరోసారి భూకంపం
 శనివారం నాటి భూకంపాన్ని మరచిపోకముందే ఇవాళ మరోసారి భూకంపం అఫ్ఘాన్‌ను వణికించింది. వాయువ్య అప్ఘాన్‌లో ఇవాళ(బుధవారం) మరోసారి 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది, అయితే ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. వాయువ్య అఫ్ఘాన్‌లో బుధవారం రిక్టర్‌ స్కేలుపై 6.3 తీవ్రతతో  భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పరిశోధనా కేంద్రం నివేదించింది. 


 వందలాది ఇళ్లు నేలమట్టం..
 భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి క్షతగాత్రులతో కిటకిటలాడుతోంది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా ఇప్పటివరకూ అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఐక్యరాజ్యసమితి యొక్క మానవతా కార్యాలయం భూకంప ప్రతిస్పందన కోసం 5 మిలియన్ డాలర్లు విలువైన సాయం ప్రకటించింది. తాలిబాన్లు అఫ్ఘాన్‌లో పాలనను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం నిలిపివేశారు.


 రషీద్‌ పెద్ద మనసు..
 అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. భూకంప బాధితులను ఆదుకుంటానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను ఆడుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు డొనేట్ చేస్తానని ప్రకటించారు. అలాగే త్వరలోనే ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కూడా ప్రారంభిస్తానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.