ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అంతులేని కథలు బయటపడుతున్నాయి. మహిళలు, చిన్నారులు ఇలా వీరు అని చూడకుండా చంపేశారు. ఇంకా చెప్పాలంటే రాక్షసత్వంగా ప్రవర్తించారు. దొరికిని వారిని దొరికనట్లే చంపేశారు. మహిళలు, చిన్నారులను పాలస్తీనాలోకి ఎత్తుకెళ్లారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో అభంశుభం తెలియని 40 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కెఫర్ అజా కిబుట్జ్‌లో చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. కొన్నింటికి తలలు కూడా లేవని వారు చెప్పడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఎక్కడ చూసినా చెల్లాచెదురైన మృతదేహాలే
హమాస్ మిలిటెంట్ల దాడులతో కిబుట్జ్ ప్రస్తుతం భీతావహంగా కన్పిస్తోంది. ఎక్కడ చూసినా చెల్లాచెదురైన మృతదేహాలే కనిపిస్తున్నాయి. కాలిపోయిన ఇళ్లు, కార్లలో నుంచి వాటిని ఇజ్రాయెల్ సైనికులు వెలికితీశారు. పిల్లలు, తల్లులు అనే తేడా లేకుండా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులు వారిని అతి భయంకరంగా చంపారు. మాటలతో చెప్పలేనంత దారుణంగా ప్రాణాలను బలితీసుకున్నారు. ఇంతటి దారుణానికి తెగబడిన హమాస్‌ను వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. చిన్నారులతో సహా అమాయక ప్రజలను కాల్చి చంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హమాస్‌ను వెంటాడి, వేటాడి ఈ భూమిపై లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ఒక్కొక్కటిగా వెలుగులోకి దురాగతాలు
హమాస్ ఉగ్రవాదులు అక్కడి పౌరులపై జరిపిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముష్కరులు ఇళ్లల్లోకి చొరబడి పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి అమాయక పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారు. క్రూరమైన ఈ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులను వీధుల్లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. పురుగుల్ని నలిపినట్లుగా ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను పాయింట్ బ్లాంక్‌లో కాల్చేశారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతంగా లాక్కొని వారిని బంధించారు. బందీలుగా ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా, ఒక్క పసికందుకైనా వారు హాని చేస్తే, అది హమాస్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఐడీఎప్ హెచ్చరించింది. తాము ఎటువంటి హెచ్చరికలు లేకుండా బాంబింగ్ చేయమని వెల్లడించారు. ఐడీఎఫ్ దాడికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసి లేదా వార్నింగ్ షాట్స్ పేల్చి హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. సామాన్య ప్రజలు కూడా ఆ ప్రదేశాల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తామని తెలిపింది.
చనిపోయినట్లు నటిస్తూ ప్రాణాలు కాపాడుకున్న యువతి
గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్‌వద్ద జరిగిన ఈ సంగీత సంబరానికి సుమారు 3,000 మంది హాజరయ్యారు. పార్టీకి హాజరైన వారిలో ఏస్తర్ బ్రోచోవ్ అనే మహిళ ఉన్నారు. కాల్పులు మొదలు కాగానే కారులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వాహనం మరో దానిని ఢీకొనడంతో ఆగిపోయింది. సమీపంలో కారు నడుపుతున్న ఓ యువకుడు ఆమెను రక్షించేందుకు తన వాహనంలో ఎక్కించుకున్నారు. కొద్దిసేపటికే ఆ యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో హమాస్ ముష్కరులు కాల్చి చంపారు. దీంతో ఏస్తర్ చనిపోయినట్లు నటిస్తూ ఏమాత్రం కదలకుండా అక్కడే పడిపోయారు. ముష్కరులు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఇజ్రాయెల్ సైనికులు వచ్చి ఆమెను రక్షించారు. మరికొందరు చెట్లు, పొదల చాటున దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిలిటెంట్లు ప్రతి చెట్టు వద్దకూ వెళ్లి వెతికి కనిపించిన వారిని విచక్షణా రహితంగా కాల్చి చంపారు.