Israel Gaza Attack:



గాజాని చీల్చిన ఇజ్రాయేల్..


గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయేల్ దాడులు (Israel Hamas War) కొనసాగిస్తోంది. వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది పౌరులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. పూర్తి స్థాయిలో గాజాపై పట్టు సాధించేంత వరకూ దాడులు ఆపేదే లేదని స్పష్టం చేస్తోంది ఇజ్రాయేల్. ఈ క్రమంలోనే  మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. గాజాని పూర్తిగా చుట్టుముట్టామని తేల్చి చెప్పింది. అంతే కాదు. ప్రస్తుతం ఈ ప్రాంతం నార్త్ గాజా, సౌత్ గాజాగా విడిపోయిందని, రెండు ముక్కలైపోయిందని స్పష్టం చేసింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (Israel Defence Forces) రంగంలోకి దిగి గాజాని చుట్టుముట్టాయి. తమ యుద్ధంలో ఇది చాలా కీలకమైన దశ అని ఇజ్రాయేల్ ప్రకటించింది. గాజాని చీల్చేశామని వెల్లడించింది. యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. అటు అంతర్జాతీయంగానూ ఈ యుద్ధంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇజ్రాయేల్‌కి పూర్తి స్థాయిలో మద్దతునిస్తోంది అగ్రరాజ్యం. ఇప్పటికే యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోని బ్లింకెన్ (Antony Blinken) పాలస్తీనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అంతకు ముందు ఇరాక్‌లోనూ పర్యటించారు. నాలుగు వారాలుగా జరుగుతున్నయుద్ధంలో దాదాపు 9,770 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో 1,400 మంది పౌరులు చనిపోయారు. బదులు తీర్చుకునేందుకు వెంటనే ఎదురు దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయేల్. 


పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్..


గాజాపై దాడులు చేసి రెండుగా చీల్చాలనుకుంది ఇజ్రాయేల్. ఇప్పుడా లక్ష్యాన్ని సాధించినట్టు ప్రకటించింది. మరో 48 గంటల్లో ఇజ్రాయేల్ సైన్యం గాజాని చుట్టుముడుతుందని సమాచారం. పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నార్త్ గాజాలో ఎక్కువగా ఈ దాడులు జరుగుతాయని అక్కడి మీడియా అంచనా చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దాడులను అడ్డుకోవడం అసాధ్యమని, గాజా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చినట్టే అని ఇజ్రాయేల్ స్పష్టం చేస్తోంది. బందీలను విడిచి పెట్టేంత వరకూ హమాస్‌పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తేల్చి చెప్పారు. 


ఇరాన్‌కి చెందిన ఓ సంస్థ సూసైడ్ బాంబర్స్‌ కావలెను అని చాలా చోట్ల పోస్టర్లు అంటించింది. ప్రస్తుతం ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లపై చర్చ జరుగుతోంది. హిజ్బుల్లా (Hezbollah) ఈ ప్రకటన చేసింది. లెబనాన్‌లో చాలా యాక్టివ్‌గా పని చేస్తోంది  ఈ సంస్థ. Daily Express వెల్లడించిన వివరాల ప్రకారం...ఇరాన్‌లోని మషాద్ (Mashhad) సిటీలో చాలా చోట్ల గోడలపై ఈ పోస్టర్లు పెట్టారు. అంతే కాదు. మామూలు ఉద్యోగాలకు ఎలా అయితే వ్యక్తిగత వివరాలు అడుగుతారో...అలానే పర్సనల్ డిటైల్స్ ఇవ్వాలంటూ ఆ పోస్టర్లపై మెన్షన్ చేశారు. స్పెషల్ బెటాలియన్‌లో చేరే అవకాశం కావాలంటే ఈ ఉద్యోగంలో చేరాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. పాలస్తీనా కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లే అర్హులు అంటూ తేల్చి చెప్పారు. 


Also Read: హమాస్ ఇజ్రాయెల్ యుద్దానికి నెల రోజులు, 9,700 మంది పాలస్తీనియన్లు మరణం