గాజాపై నెల రోజులుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ దళాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇప్పటి దాకా జరిగిన ఘర్షణలో 9,700 మంది పాలస్తీనీయులు మరణించారు. కాల్పుల విరమణకు పలు దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను ఇజ్రాయెల్ భేఖాతరు చేస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్‌ తోసిపుచ్చింది. వివిధ దేశాల సూచనలను పట్టించుకోకుండా గాజాపై భీకర దాడులను కొనసాగిస్తూనే ఉంది. గాజాలో కాల్పులు విరమించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. గాజాలో ప్రజలకు సాయం అందించేందుకు వీలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పులు విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్న నేపథ్యంలో నెతన్యాహు తమ వైఖరిని వెల్లడించారు. సెంట్రల్‌ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. తమ దేశంలోని దక్షిణ ప్రాంతంలో రెండు కార్లపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసిందని, ముగ్గురు పిల్లలు, ఒక మహిళ మరణించారని లెబనాన్‌ వెల్లడించింది. మరోవైపు హెజ్‌బొల్లా దాడిలో ఓ ఇజ్రాయెలీ మృతి చెందారు.


దాడుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తే హమాస్‌ రెచ్చిపోతుంది
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో వేలసంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాడుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తే హమాస్‌ మరింత బలంగా తయారవుతుందని, ఆయుధాలను సమకూర్చుకుంటుందని అమెరికా అభిప్రాయపడింది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎదురుదెబ్బ తగులుతుందని, మిలిటెంట్లు ఇంకా హింసాత్మకంగా వ్యవహరిస్తారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించారు. అరబ్‌ దేశాల విదేశాంగ మంత్రులతో, పాలస్తీనా సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. 


సామూహిక శిక్ష విధిస్తున్నారన్న ఈజీప్ట్
ఆత్మరక్షణ కోసమే గాజాలో దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చేస్తున్న వాదనను అంగీకరించలేమని ఈజిప్టు స్పష్టం చేసింది. గాజాలోని పాలస్తీనావాసులకు సామూహిక శిక్ష విధిస్తున్నట్లుగా ఉందని, చట్టబద్ధ ఆత్మరక్షణగా దీన్ని పేర్కొనలేమని వ్యాఖ్యానించింది. మానవతా సాయం దృష్ట్యా ఇజ్రాయెల్‌ సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలనే ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్లు అంటోని బ్లింకెన్ తెలిపారు. పశ్చిమాసియాలో దౌత్య యత్నాలను ముమ్మరం చేసిన అంటోని బ్లింకెన్‌ వెస్ట్‌బ్యాంక్‌లో పర్యటిస్తున్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో అక్కడ భేటీ అయ్యారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సాయుధ వాహనశ్రేణితో ఆయన రమల్లాకు చేరుకున్నారు. గాజాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.


అమెరికాలో పాలస్తీనా అనుకూలవాదుల ఆందోళన
గాజాలో వెంటనే కాల్పుల విరమించాలని అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఎదుట వేల మంది పాలస్తీనా అనుకూలవాదులు ఆందోళనకు దిగారు. ఇజ్రాయెల్‌కు అమెరికా చేస్తున్న సాయాన్నీ ఆపాలని కోరారు. గాజా రక్తసిక్తమవుతున్న తీరుకు నిరసనగా శ్వేతసౌధం గేటుకు ఎరుపు రంగు వేశారు. ఈ ఆందోళనలో దాదాపు 10వేల మందికిపైగా పాల్గొన్నారు. జర్మనీలోని బెర్లిన్‌లోనూ ఆందోళనలు జరిగాయి. మరోవైపు వేల మంది ఇజ్రాయెల్‌ ఆందోళనకారులు జెరూసలెంలోని ప్రధాని నెతన్యాహు ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని రాజీనామా చేయాలని, హమాస్ నుంచి బందీలను విడిపించాలని డిమాండు చేశారు.