India Canada Tensions: 


ఉద్రిక్తతలు..


ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ( Hardeep Singh Nijjar) భారత్‌, కెనడా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే...ఈ ఘటనకు భారత్‌కి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. కానీ...కెనడా అధికారులు పోలీసులకు విచారణలో సహకరించడం లేదని ఆరోపించారు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ. Globe and Mail కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణను కొంత మంది కెనడా ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. కుట్రపూరితంగా భారత్‌పై ఈ తప్పుని తోసేందుకు ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. 


"నిజ్జర్ హత్యపై కెనడాలో విచారణ జరుగుతోంది. కానీ అది సరైన విధంగా జరగడం లేదు. ఇప్పటికే కొందరు అధికారులు ఇందులో జోక్యం చేసుకున్నారు. విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ హత్య వెనకాల కచ్చితంగా భారత్‌కి చెందిన వాళ్లు ఉన్నారని నిరూపించాలని పై నుంచి ఒత్తిడి వస్తోంది. కెనడా భద్రతా బలగాలన్నీ పనిగట్టుకుని మరీ దీన్ని రుజువు చేసేందుకు కుట్ర చేస్తున్నాయి"


- సంజయ్ కుమార్ వర్మ, భారత హై కమిషనర్


విచారణ సరిగ్గా జరగడం లేదని ఆరోపించిన సంజయ్ కుమార్ వర్మ...ఆ అధికారి పేరు మాత్రం చెప్పలేదు. నిజ్జర్ హత్యలో భారత్‌కి సంబంధం ఉందనడానికి కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అయితే...ఈ వివాదమంతా పక్కన పెట్టి కెనడాతో మునుపటిలా మైత్రి కొనసాగించేందుకు భారత్‌ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.