Israel Gaza War:


ఇజ్రాయేల్‌కి అమెరికా ఆయుధాలు..! 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War) జరిగినప్పుడు ముందుగా స్పందించింది అగ్రరాజ్యమే. రష్యాపై పైచేయి సాధించాలన్న లక్ష్యంతో ఉక్రెయిన్‌కి పెద్ద ఎత్తున సాయం అందించింది. ఆయుధాలు, క్షిపణులు సరఫరా చేసింది. ఉక్రెయిన్‌కి అన్ని విధాలుగా అండగా నిలబడింది. ఇప్పుడు ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం (Israel Hamas War) విషయంలోనూ ఇదే విధంగా పెద్దన్నపాత్ర పోషిస్తోంది. ఇజ్రాయేల్‌కి పూర్తిస్థాయిలో మద్దతునిస్తోంది. మద్దతుతో పాటు యుద్ధానికి అవసరమైన సామగ్రినీ సమకూర్చుతోందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కి పంపిన ఆయుధాలను (US Weapons to Israel) దారి మళ్లించి ఇజ్రాయేల్‌కి పంపుతున్నట్టూ సమాచారం. ఇదంతా చాలా సైలెంట్‌గా జరిగిపోతోందని తెలుస్తోంది. లేజర్ గైడెడ్ మిజైల్స్, నైట్ విజన్ డివైజ్‌లు, బంకర్లను ధ్వంసం చేసేందుకు వినియోగించే సామగ్రితో పాటు కొత్త ఆర్మీ వెహికిల్స్‌నీ అమెరికా పంపుతున్నట్టు అంతర్గత సమాచారం. సామాన్యుల మరణాలకు బాధ్యత వహించాల్సిందే అని అమెరికా ఇజ్రాయేల్‌కి వార్నింగ్ ఇస్తున్నప్పటికీ...అందాల్సిన సాయం మాత్రం అందిస్తోంది. ఇజ్రాయేల్‌ విజ్ఞప్తి మేరకు అవసరమైన ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తోందట. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయుధాలు ఇజ్రాయేల్‌కి చేరుకున్నాయని తెలుస్తోంది. రోజువారీగా ఈ ఆయుధాలను తరలిస్తున్నారట. 


అమెరికాపై ఆగ్రహం..


ఇప్పటికే Iron Dome తో ఇజ్రాయేల్ సెక్యూరిటీ చాలా పటిష్ఠంగా ఉండగా..ఇప్పుడు అమెరికా పంపిన ఆయుధాలతో అది మరింత బలోపేతమైంది. అయితే...అమెరికా తీరుపై పలువురు మండి పడుతున్నారు. ఇజ్రాయేల్ దారుణంగా దాడులు చేస్తూ వేలాది మందిని బలి తీసుకుంటుంటే...అందుకు అమెరికా సాయం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గాజాలో కనీసం 10 వేల మంది యుద్ధం కారణంగా చనిపోయినట్టు అంచనా. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇజ్రాయేల్‌కి ఆయుధాలు సరఫరా చేయొద్దంటూ అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. గాజా లాంటి చిన్న ప్రాంతంలో అంత పెద్ద ఆయుధాలు వినియోగించడం సరికాదని, ఇది తీవ్ర ప్రాణనష్టానికి దారి తీస్తుందని వెల్లడించాయి. 155mm Shellsని సరఫరా చేయడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. 57 వేలకుపై షెల్స్‌ సరఫరా చేయాలని అమెరికాకి విజ్ఞప్తి చేసింది ఇజ్రాయేల్. ఈ మేరకు రష్యాపై యుద్ధం కోసం ఉక్రెయిన్‌కి పంపిన ఈ షెల్స్‌ని దారి మళ్లించి ఇజ్రాయేల్‌కి పంపుతోంది అగ్రరాజ్యం. ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం...20 లక్షల  155 mm షెల్స్‌ని ఉక్రెయిన్‌కి అందించింది అమెరికా. 


అరబ్ దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలు (US Diplomats) తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయేల్‌కి మద్దతునివ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాదు. అమెరికా ప్రభుత్వాన్ని వాళ్లు హెచ్చరించారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ సపోర్ట్ కారణంగా అరబ్ దేశాల్లోని ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్లమవుతామని వార్నింగ్ ఇచ్చారని CNN తెలిపింది. ఒమన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్తలూ ఇదే హెచ్చరికలు చేశారు. ఇది కూడా యుద్ధ నేరం కిందకే వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఇలా మద్దతునిచ్చి గౌరవం పోగొట్టుకుంటున్నామని మండి పడుతున్నారు. ఇదే విషయాన్ని అమెరికాకి టెలిగ్రామ్ చేసినట్టు తెలుస్తోంది.


Also Read: Gaza News: ఇజ్రాయేల్‌నీ గిల్లిన ట్రూడో, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నెతన్యాహు