Israel Gaza War:


యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..


Gaza News: ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కొన్ని దేశాలు హమాస్‌ని తప్పుబడుతుండగా మరి కొన్ని ఇజ్రాయేల్‌ తీరుని ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కూడా అసహనం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నా ఇజ్రాయేల్ పట్టు విడవడం లేదని మండి పడ్డారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. ప్రపంచం ఈ దాడుల్ని గమనిస్తోందని తేల్చి చెప్పారు. వైద్యులు చెబుతున్న మాటలు వింటుంటే వాళ్లు ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్థమవుతోందని అన్నారు. బ్రిటీష్ కొలంబియాలో ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిన్ ట్రూడో. 


"ఇజ్రాయేల్‌ కాస్త సంయమనం పాటిస్తే మంచిది. గాజాలోని దాడులను ప్రపంచమంతా చూస్తోంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. అయిన వాళ్లను కోల్పోయిన వాళ్లు పడే బాధని చూస్తున్నాం. వైద్యులు ఆవేదననీ అర్థం చేసుకుంటున్నాం. చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైపోయారు. మహిళలను, చిన్నారులను అత్యంత దారుణంగా చంపుతున్న ఈ దాడులను ప్రపంచం గమనిస్తోంది. తక్షణమే వీటిని ఆపేయాలి"


- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని 


నెతన్యాహు కౌంటర్..


అయితే...ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయేల్ అసహనం వ్యక్తం చేసింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్విటర్ వేదికగా మండి పడ్డారు. పౌరులను చంపాలన్న ఉద్దేశం తమకు లేదని, కేవలం హమాస్‌ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని స్పష్టం చేశారు. 


"అమాయక పౌరులు మా లక్ష్యం కాదు. కేవలం హమాస్‌ ఉగ్రవాదులే మా టార్గెట్. హోలోకాస్ట్ తరవాత యూదులపై ఈ స్థాయిలో ఎప్పుడూ దాడులు జరగలేదు. ప్రజల్ని రక్షించాలని మేం చూస్తుంటే..వాళ్లను అంతం చేయాలని హమాస్‌ కుట్ర చేస్తోంది. గాజాలోని పౌరులకు ఇజ్రాయేల్ మానవతా సాయం చేస్తుంటే...హమాస్ ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధ నేరాలకు పాల్పడినందుకు మీరు నిందించాల్సింది హమాస్‌నే తప్ప ఇజ్రాయేల్‌ని కాదు. హమాస్‌ని అంతం చేశాక కానీ ఇజ్రాయేల్ సైన్యం వెనుదిరగదు"


- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని 


 






ఇజ్రాయేల్, హమాస్‌ మధ్య (Israel Hamas War) జరుగుతున్న యుద్ధంలో Al Shifa హాస్పిటల్‌ (Al Shifa Hospital) కీలకంగా మారింది. మొత్తం యుద్ధం అంతా ఇక్కడ ఒక్క చోటే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ హాస్పిటల్‌నే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా వినియోగించుకుంటున్నారని ఇజ్రాయేల్‌ భావిస్తోంది. అందుకే ఈ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ కారణంగా వేలాది మంది రోగులకు వైద్యం అందడం లేదు. చిన్నారులు చనిపోతున్నారు. మరి కొంత మంది గాజా పౌరులు (Gaza Updates) అక్కడి నుంచి వేరే చోటకు వెళ్లిపోతున్నారు.


Also Read: ఇంటర్నెట్ స్పీడ్‌లో చైనా సరికొత్త రికార్డ్, సెకన్‌కి 150 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చట