Earthquake in Sri Lanka: కొలంబో: శ్రీలంకలో భారీ భూకంపం సంభవించింది. లంక రాజధాని కొలంబోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. తీవ్ర స్థాయిలో భూకంపం రావడంతో ప్రజలు భయందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. లంక (Sri Lanka)లో సంభవించిన తాజా భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది.
శ్రీలంక రాజధాని కొలంబోకి ఆగ్నేయ దిశ (South East of Colombo)గా 1326 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ షర్ సిస్మాలజీ వెల్లడించింది. తాజాగా సంభవించిన భూకంపం వల్ల లంక దేశానికి అంతగా నష్టం ఉండదని అమెరికా నిపుణులు అంచనా వేశారు.
భారత్‌లోనూ భూ ప్రకంపనలు..
శ్రీలంకలో భారీ భూకంపం సంభవించగా.. భారత్ లోనూ లడాఖ్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. లడాఖ్ లో మంగళవారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. మధ్యాహ్నం 1 గంట తరువాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కార్గిల్‌కు వాయువ్యంగా 314 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు.