Israel Palestine Attack: 


పుతిన్ వ్యాఖ్యలు..


ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం విధ్వంసం సృష్టిస్తోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. గాజా వద్ద పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంపై మళ్లీ పట్టు సాధించామని ఇజ్రాయేల్ ప్రకటించింది. ఈ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు మద్దతునిస్తూనే అమెరికాపై మండి పడ్డారు. మధ్యప్రాచ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అమెరికా వృథా ప్రయత్నాలు చేసిందని, ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. పాలస్తీనా సమస్యలేంటో అమెరికా పట్టించుకోలేదని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇటు ఇజ్రాయేల్‌తో పాటు అటు పాలస్తీనాతో రష్యా సంప్రదింపులు జరుపుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. యుద్ధం ముగిసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే..ఈ ప్రయత్నాలు ఎలా చేస్తోందన్నది మాత్రం క్లారిటీ లేదు. అక్కడి వివాదం మరి కొన్ని రోజులు కొనసాగితే..మిగతా ప్రాంతాలపైనా ఆ ప్రభావం గట్టిగానే ఉంటుందని హెచ్చరించింది రష్యా. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీతో మాట్లాడారు పుతిన్. ఈ సమావేశంలోనే అమెరికా విధానాన్ని ఖండించారు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాలసీ ఫెయిల్‌ అయిందనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఇంకేదీ ఉండదని తేల్చి చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. "స్వతంత్ర హోదా" కావాలన్న పాలస్తీనా ఆకాంక్షల్ని అమెరికా పట్టించుకోలేదని మండి పడ్డారు. 


అమెరికా మద్దతు..


అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య కలిసి Quartet ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయేల్‌-పాలస్తీనా మధ్య వివాదాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా 2002లో ఇది ఏర్పాటైంది. అప్పటి నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అటు అమెరికా ఇజ్రాయేల్‌కి పూర్తి మద్దతుగా ఉంటామని ప్రకటించింది. ఈ యుద్ధ పరిస్థితులను అనువుగా తీసుకుని ఇజ్రాయేల్‌పై దాడులు చేయాలని చూస్తే దీటుగా బదులిస్తామని ఇతర దేశాలకూ వార్నింగ్ ఇచ్చింది. భారత్‌ కూడా ఇదే ప్రకటన చేసింది. ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి. గత ఐదు రోజుల్లో 3000 మందికి పైగా మరణించారు. ఎక్కడ చూసిన మృతదేహాలతో రెండు ప్రాంతాలు భీకరంగా కనిపిస్తున్నాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి.  అయినా ఇజ్రాయెల్, హమాస్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. గాజాపై దాడులను ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మందిని పిలిపించారు. గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ నివేదించింది. 


Also Read: కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ! సమస్య కొలిక్కి వచ్చినట్టేనా?