Gaza Refugee Camp Attack: 



ఇజ్రాయేల్ దాడులు..


గాజాపై ఇజ్రాయేల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో (Israel Hamas War) ఎంతో మంది పౌరులు బలి అవుతున్నారు. ఇటీవల  Israeli Defence Forces (IDF) గాజాలోని అతి పెద్ద  శరణార్థుల శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 50 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనా హోం మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై దాడి చేసిన హమాస్‌ కమాండర్లలో ఒకరు తమ దాడుల్లో  హతమైనట్టు ఇజ్రాయేల్ ప్రకటించింది. దాదాపు నాలుగు రోజులుగా గాజాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది ఇజ్రాయేల్ సైన్యం. పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు ఇక్కడి సొరంగాల్లో దాక్కున్నట్టు ఇజ్రాయేల్ సైన్యం పసిగట్టింది. అందుకే వరుస పెట్టి దాడులు చేస్తోంది. ఇక్కడి బియారి టన్నెల్ (Biari Tunnel)లో చాలా మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు గుర్తించింది. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై దాడికి ప్లాన్ చేసింది ఇక్కడి నుంచే అని సమాచారం. అంతే కాదు. ఈ దాడులకు కారణమైన Nukhba ఉగ్రవాదులు ఇక్కడి నుంచే టీమ్స్‌లా విడిపోయి దాడులు చేసినట్టు తెలుస్తోంది. వీళ్లందరి నాయకుడైన ఇబ్రహీం బియారి (Ibrahim Biari) ఇజ్రాయేల్ దాడుల్లో చనిపోయాడు. ఇప్పుడే కాదు. 2004లో అశ్దోద్ పోర్ట్‌ వద్ద (Ashdod Port Terror Attack) దాడులకు పాల్పడింది కూడా ఇబ్రబీం బియారియేనని ఇజ్రాయేల్ వెల్లడించింది. ఆ సమయంలో దాదాపు 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇజ్రాయేల్‌పై రాకెట్‌ దాడులను లీడ్‌ చేస్తున్నాడు ఇబ్రహీం బియారి. అందుకే...అతడినే లక్ష్యంగా చేసుకుని క్యాంప్‌లపై దాడులు చేసింది ఇజ్రాయేల్. 


ఇజ్రాయేల్ సైన్యం ప్రకటన..


ఈ దాడుల తరవాత గాజాలో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. దీనిపై ఇజ్రాయేల్ ఫోర్సెస్ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. అంతరాయానికి చింతిస్తున్నట్టు వెల్లడించింది. ఈ దాడుల్లో Al Jazeera కి చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ కుటుంబానికి చెందిన 19 మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. గాజా బ్యూరోలో పని చేస్తున్న మహమ్మద్ అబు అల్ కుమ్సన్ తండ్రి, సోదరుడుతో పాటు బంధువులందరినీ కోల్పోయాడు. 


"దేశ ప్రజలందరికీ అసౌకర్యం కలిగిస్తున్నందుకు క్షమాపణలు. గాజాలో కమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్ సేవల్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం. హమాస్‌ని అంతమొందించే వరకూ ఊరుకోం. వాళ్లు వేలాది మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అందుకు సరైన బదులు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. మా దేశం కోసం కచ్చితంగా పోరాడి తీరుతాం"


- ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్