Sania Mirza On Gaza Attacks: తమ దేశంపై మెరుపుదాడి చేసి నెత్తుటేరులు పారించిన హమాస్‌ ముష్కరులను ఏరిపారేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. హమాస్‌ ఉగ్ర స్థావరాలకు భావిస్తున్న బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే వేల మంది ఇజ్రాయెల్‌ చేస్తున్న వైమానిక, భూతల దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాదాపు 1,17,000 మంది గాజా వాసులు ఉత్తర గాజాలోని ఆసుపత్రుల వద్ద తలదాచుకుంటున్నారు. ఆసుపత్రుల్లో వేల మంది రోగులున్నారు. 600 లక్ష్యాలపై దాడులు చేశామని తెలిపింది. అయితే ఈ దాడులపై తొలిసారి ఇండియా స్టార్‌ టెన్నీస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా స్పందించింది. ఇజ్రాయెల్‌, గాజాల్లో ఎవరు ఎటువైపు ఉన్నా అత్యావసరాలను అందించాలని పిలుపునిచ్చింది. 

 

ఇజ్రాయెల్‌, గాజాపై ఎవరు ఎటు వైపు ఉన్నా... గాజాలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా నిలవాలని సానియా మీర్జా సూచించింది. గాజా బాధితులకు ఆహారం, నీరు, విద్యుత్‌ సరఫరాను కూడా ఆపుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసింది. పాలస్తీనా, గాజా ప్రజల కష్టాలు తనను కలచివేస్తున్నాయని సానియా వాపోయింది. బాధితులకు ఆహారం, నీరు, విద్యుత్‌ను నిలిపివేయడంపై ఈ టెన్నీస్‌ స్టార్‌ పలు ప్రశ్నలు సంధించింది. పాలస్తీనా, గాజా ప్రజల కష్టాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. గాజాలో గాయపడిన, బాధపడుతున్న ప్రజలకు ఆహారం, విద్యుత్ నిషేధంపై అనేక ప్రశ్నలను సంధించింది. ఎవరి పక్షాన ఉన్నా పర్వాలేదని, కనీసం మానవత్వం ఉండాలని సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సందేశం ఇచ్చింది.

 

మానవత్వం లేదా..?

బాంబుల మోత వినిపిస్తోందని.. ఆ మోతతో విశ్వాసం చలించిపోతుందని సానియా స్టోరీలో పేర్కొంది. మీరు ఏ వైపు ఉన్నారనేది పట్టింపు లేదని.... మీ రాజకీయ అభిప్రాయాలు ఏమిటన్నది తమకు అనవసరమని తెలిపింది. 20 లక్షలకు పైగా అమాయక జనాభా ఉన్న గాజా నగరానికి.. ఆహారం, నీరు, విద్యుత్తు నిలిపివేశారన్న విషయాన్ని మనం కనీసం అంగీకరించగలమా... బాంబు దాడుల సమయంలో పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు ప్రశ్నించరా.. ఈ మానవతా సంక్షోభం గురించి మాట్లాడటం విలువైనది కాదా అని సానియా ప్రశ్నించింది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న అమాయక ప్రజలు నరకం అనుభవిస్తున్నారని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. 

 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. హమాస్‌ మిలిటెంట్లు ఉన్న గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడుల్ని ముమ్మరం చేయగా.. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై హమాస్‌ రాకెట్‌ దాడులకు పాల్పడుతోంది. ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నా.. దాడులు మాత్రం ఆగట్లేదు. కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు  కీలక ప్రకటన చేశారు. గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు అవుతుందని, అలా ఎప్పటికీ జరగనివ్వమని స్పష్టం చేశారు. హమాస్‌ చెరలో ఉన్న బందీలను విడిపించుకోవడంలో తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని కోరారు.