Israel Palestine Attack: 


ఎయిర్‌ ఫోర్స్ చీఫ్ మృతి..


ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (Israel Defense Forces) గాజాపై రాకెట్‌లతో వరుస దాడులు చేస్తోంది. అర్ధరాత్రి వరకూ రాకెట్‌లతో విరుచుకు పడింది. దాదాపు 24 గంటలుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ హతమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గాజా వద్ద జరిగిన దాడుల్లో హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ మురద్ అబ్ మురద్‌ (Murad Abu Murad) మృతి చెందినట్టు తెలిపింది. గాజాలో హమాస్ ఉగ్రవాదులకు ఓ హెడ్‌క్వార్టర్స్‌ ఉంది. అందులో నుంచే ఇజ్రాయేల్‌పై మెరుపు దాడులకు ప్లాన్ చేశారు. గగనతలం నుంచి దాడులు చేశారు. ఇప్పుడా భవనంపై ఇజ్రాయేల్‌ సైన్యం దాడి చేసింది. అందులో ఉన్న మురద్ అబ్‌ మురద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు The Times of Israel స్పష్టం చేసింది. ఉగ్రవాదులను ముందుండి లీడ్ చేసిన మురద్‌ని మట్టుబెట్టినట్టు తెలిపింది. హమాస్ కమాండో ఫోర్సెస్ దాక్కుని ఉన్న అన్ని ప్రాంతాలనూ ధ్వంసం చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. హమాస్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటోంది. గత వారం హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్టుండి ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌ పంపారు. భవనాలు నేలమట్టం అయ్యాయి. గాజా ప్రాంతం బాంబుల మోతలతో దద్దరిల్లిపోయింది. అక్టోబర్ 7 నుంచి గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంపై పట్టు సాధించామని ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రకటించింది. ఇప్పటి వరకూ 1,300 మంది ఇజ్రాయేల్ పౌరులు, 1,530 మందికి పైగా గాజా పౌరులు బలి అయ్యారు. 1,500 మంది హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయేల్ వెల్లడించింది.