Israel Gaza war: హమాస్ భరతం పట్టే వరకు విశ్రమించేది లేదని పదే పదే చెబుతూ వస్తున్న ఇజ్రాయెల్ మరో బిగ్ హెడ్‌ను హతమార్చింది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వార్‌ను నేల కూల్చింది. ఈయనే 7 అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్‌పై దాడులకు సూత్రధారిగా చెబుతారు. అయినప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం "ఇంకా ముగియలేదు" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ... హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం చంపేసిందని చెప్పారు. శత్రువులకు "భారీ దెబ్బ తగిలింది" అని ప్రకటించిన ఆయన..."మన ముందున్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు" అని హెచ్చరించాడు.
"మనకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారందరికీ ఇదే జరుగుతుందని ఇవాళ నిరూపించాం. మంచి శక్తులు ఎల్లప్పుడూ చెడును ఓడించి చీకటిని పారద్రోలుతాయి.. యుద్ధం ఇంకా కొనసాగుతోంది." అని నెతన్యాహు అన్నారు.
గాజాపై దాడి జరిగిన వెంటనే IDF ఒక ప్రకటన జారీ చేసింది. జరుగుతున్న ఆపరేషన్‌లో యాహ్యా సిన్వార్ చనిపోయాడా లేదా అనే విషయంలో పరిశీలన జరుగుతుందని చెప్పింది. "గాజాలో IDF ఆపరేషన్ల టైంలో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. అందులో ఒకరు యాహ్యా సిన్వార్ ఉంటారని పరిశీలిస్తున్నాం" అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.అక్టోబరు 17న జరిగిన దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన భవనంలో ఇజ్రాయెల్ బందీలు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఐడీఎఫ్ వెల్లడించింది.
గాజాలో హమాస్ అధినేత హతమైనట్టు DNA టెస్టు ద్వారా తేలినట్టు ఇజ్రాయెల్ తమకు సమాచారం ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఇది ఇజ్రాయెల్‌కు, యునైటెడ్ స్టేట్స్‌కు, ప్రపంచానికి మంచి రోజు" అని బిడెన్ అన్నారు, గతేడాది నుంచి సిన్వార్ కోసం ఇజ్రాయెల్ వేట కొనసాగుతోదని అందుకు యుఎస్ ఇంటెలిజెన్స్ సహాయపడింది.
సిన్వార్ మరణం ఇజ్రాయెల్ సైన్యానికి, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకి మంచి బూస్ట్ లాంటి అంశం. ఈ మధ్య కాలంలో హమాస్‌తోపాటు తన శత్రువులుగా భావిస్తున్న వారందరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్. దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంలో టార్గెట్ గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా సిన్వార్‌ను ఎలిమినేట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత డీఎన్‌ఏ పరీక్షలు జరిపారు.
ఆ ముగ్గురిలో ఒకరు సిన్వార్ అయి ఉండొచ్చని నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్షలు జరిపినట్టు తెలిసింది. ముఖ్యంగా సిన్వార్ ఇజ్రాయెల్ జైలులో ఉన్నప్పటి నుంచి అతని DNA నమూనాలు భద్రపరిచారు. వాటి ఆధారంగా టెస్టులు చేసి సిన్వార్ మృతిని ధ్రువీకరించారు.
గాజా యుద్ధానికి దారితీసిన అక్టోబర్ 7, 2023 దాడికి ప్రధాన సూత్రధారి అయిన సివార్ ఇజ్రాయెల్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. గాజాలో హమాస్ నిర్మించిన సొరంగాల్లో దాక్కుని తప్పించుకోగలిగాడు. గతంలో గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు నాయకుడిగా ఉండేవాడు. ఆగస్టులో టెహ్రాన్‌లో మాజీ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో ఈయనకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.
గత నెలలో ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉద్యమ నాయకుడు హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ బీరుట్‌లో చంపింది. ఈ గ్రూప్‌ను నడిపించే అగ్ర నాయకత్వంలో కనిపించే అనేక మంది ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. 2023 అక్టోబర్ 7న, హమాస్ నేతృత్వంలోని ముష్కరులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపి, 250 మందికిపైగా ప్రజలను బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తూనే ఉంది. ఇందులో 42,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. దాడుల్లో గాజా శిథిలమైంది. భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.