Arrest warrant for Russia President Putin: గత ఏడాది నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురహంకారం కారణంగానే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నందున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశం ఉక్రెయిన్ పై జరిపిన యుద్దం, మారణకాండకు పుతిన్ ను బాధ్యుడ్ని చేస్తూ క్రిమినల్ కోర్టు శుక్రవారం రష్యా అధినేతపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఒక దాడులలో భాగంగా పొరుగు దేశంలో రష్యా నేరాలకు పాల్పడిందని వస్తున్న ఆరోపణలను రష్యా మొదట్నుంచీ ఖండిస్తూనే ఉంది. మైనర్లను చట్టవిరుద్ధంగా బహిష్కరించడంతో పాటు ఉక్రెయిన్ దేశం నుంచి రష్యా ఫెడరేషన్‌కు చట్టవిరుద్ధంగా ప్రజలను తరలించడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. జనాభాను ముఖ్యంగా చిన్నారులను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి రష్యా ఫెడరేషన్‌కు జనాభా (పిల్లలను) చట్టవిరుద్ధంగా తరలించడం వంటి చర్యలకు పుతిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఒక ప్రకటనలో పేర్కొంది.






ప్రజలను ముఖ్యంగా చిన్నారులను ఓ ప్రాంతం నుంచి బహిష్కరించడం, చట్టానికి వ్యతిరేకంగా తరలించడం లాంటి చర్యలను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఐసీసీ అధికారులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేయనుందని ఇటీవల రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా అలెక్సేవ్నా ల్వోవా బెలోవాకు సైతం కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.


ఇది ఆరంభం మాత్రమే: ICC చర్యపై ఉక్రెయిన్ రియాక్షన్ ఇదే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని, రష్యాకు కోర్టులోనే శిక్ష పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రధాన అధికారి ఆండ్రీ ఎర్మాక్ అన్నారు. ఐసీసీ నిర్ణయాన్ని రష్యా అధికారులు తీవ్రంగా ఖండించగా, మరోవైపు ఉక్రెయిన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఉక్రెయిన్.