Central Govt on Twitter:
కర్ణాటక హైకోర్టులో పిటిషన్
ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావించిన కేంద్రం...ట్విటర్ అమెరికన్ కంపెనీ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఆ సంస్థకు వర్తించదని తేల్చి చెప్పింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19 అనేది కేవలం భారతీయ పౌరులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన పలు ఆంక్షలపై అసహనం వ్యక్తం చేసిన ట్విటర్..కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో కొన్ని ట్విటర్ అకౌంట్‌లను బ్లాక్ చేయాలని కేంద్రం తమపై ఒత్తిడి తెచ్చిందని ట్విటర్ కోర్టులో తెలిపింది. ఈ ఆదేశాలు పక్షపాతంగా ఉన్నాయని, ముందుగా నోటీసులు పంపకుండా అప్పటికప్పుడు పోస్ట్‌లు బ్లాక్ చేయమని చెప్పడమేంటని అసహనం వ్యక్తం చేసింది. అయితే...ప్రభుత్వం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్ శంకరనారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19...విదేశీ కంపెనీ అయిన ట్విటర్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని వెల్లడించారు. ట్విటర్‌కు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేమని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 69(A) ప్రకారం ఇది అనైతికం అని ట్విటర్ వాదించింది. సమానత్వం కల్పించే ఆర్టికల్ 14ని కేంద్రం ఉల్లంఘిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.
ఫేక్ ట్వీట్‌ల పరిస్థితేంటి..?
సొలిసిటర్ జనరల్ మాత్రం ట్విటర్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఓ ప్రొఫైల్‌కు సంబంధించిన సమాచారం అడిగిన ప్రతిసారీ ట్విటర్ ప్రైవసీ పాలసీని ప్రస్తావిస్తోందని అన్నారు. ఇలాగే మినహాయింపు ఇస్తూ పోతే ఎప్పుడో ఓ రోజు ఇది ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. ఉదాహరణకు పాకిస్థాన్ ప్రభుత్వం తరపు నుంచి ట్వీట్ చేస్తున్నట్టుగా ఓ ఫేక్ ట్వీట్ వెలుగులోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని వివరించారు. కశ్మీర్ లాంటి సున్నితమైన అంశాలపై ఉద్రేకపరిచే ట్వీట్‌లు పెడితే సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదముందని చెప్పారు. కంటెంట్ రాసే వ్యక్తి వివరాలు కచ్చితంగా తెలియాలని గతంలో సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పిన సంగతిని గుర్తు చేశారు.
ఆఫీసులకు తాళం..
ఇండియాలోని ట్విటర్ ఆఫీస్‌లకు తాళం వేసేయమని ఆర్డర్ పాస్ చేశారు ఎలన్ మస్క్. భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిన మూసేశారు. ఇక్కడి ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఆఫీస్‌లు అంటే బోలెడంత ఖర్చు. మెయింటేనెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అసలే రెవెన్యూ లేక ఇబ్బందులు పడుతున్న ట్విటర్‌కు...ఇది అదనపు భారంగా మారింది. అందుకే ఆఫీస్‌లు తీసేసి ఉద్యోగులకు WFH ఆప్షన్ ఇచ్చేశారు మస్క్. భారత్‌లో ట్విటర్‌కు 200 మంది ఉద్యోగులుండేవాళ్లు. వారిలో 90% మందిని ఇప్పటికే తొలగించారు. ఇక మిగిలింది తక్కువే. వాళ్ల కోసం అంత పెద్ద ఆఫీస్‌లు ఎందుకని భావించారు మస్క్. అందుకే న్యూఢిల్లీ, ముంబయిల్లోని ఆఫీస్‌లకు తాళం వేశారు. బెంగళూరులోని ఆఫీస్ మాత్రం తెరిచే ఉంచారు. నిజానికి ఇండియాలోనే కాదు. ప్రపంచంలో చాలా చోట్ల ట్విటర్ ఆఫీస్‌లను మూసేశారు. ఈ ఏడాది పూర్తయ్యేలోగా ట్విటర్‌కు ఆర్థిక కష్టాలు తీరిపోవాలని చాలా పట్టుదలతో ఉన్నారు ఎలన్ మస్క్.
Also Read: BJP vs Rahul Gandhi: రాహుల్ సారీ చెబితేగానీ మాట్లాడనివ్వం, తేల్చి చెప్పిన బీజేపీ నేతలు