BJP vs Rahul Gandhi:


రాహుల్ వ్యాఖ్యలపై దుమారం..


రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కచ్చితంగా పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతోంది. ఆ తరవాతే పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అనుమతినిస్తామని తేల్చి చెబుతోంది. ఈ వాగ్వాదం కారణంగా ఉభయ సభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. అటు కాంగ్రెస్ అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌లతో సభ సజావుగా సాగడం లేదు. ప్రతిపక్షాల మైక్‌లు ఆఫ్ చేస్తున్నారన్న రాహుల్ ఆరోపణలను పదేపదే వినిపిస్తోంది కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని వాదిస్తోంది. సభ ప్రొసీడింగ్స్‌ కూడా జరగకుండా బీజేపీ అడ్డు పడుతోందని ట్వీట్ చేసింది. రెండో రోజూ రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు వచ్చినప్పటి నుంచి గందరగోళం నెలకొంది. ఫలితంగా వచ్చే వారం నాటికి సభను వాయిదా వేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు పార్లమెంట్‌లోనే సమాధానం చెబుతానని రాహుల్ అంటున్నారు. అటు బీజేపీ మాత్రం ఆయన సారీ చెప్పేంత వరకూ మాట్లాడనివ్వం అని తెగేసి చెబుతోంది. పరాయి దేశంలో భారత్‌ ప్రతిష్ఠను దిగజార్చారని మండి పడుతోంది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పునావాలా ట్విటర్‌లో రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ముందు ఈ దేశానికి క్షమాపణలు చెప్పండి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. 






"దురదృష్టవశాత్తూ నేనో ఎంపీని" అన్న రాహుల్ వ్యాఖ్యలపైనా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"నిజమే. రాహుల్ ఎంపీ అవడం దురదృష్టమే. పార్లమెంట్‌ సభ్యుడై ఉండి ఆ పార్లమెంట్‌నే కించపరిచారు. ఈ సభ కొన్ని నిబంధనల ప్రకారం నడుచుకుంటుందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. పార్లమెంట్‌కు వచ్చుంటే అర్థమయ్యేది. ఏమీ చదవడు. ఎప్పుడో ఓ సారి పార్లమెంట్‌కు వస్తాడు. అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది. కచ్చితంగా రాహుల్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే"


-అనురాగ్  ఠాకూర్