పండగలు, వీకెండ్స్ కి కంపెనీ సెలవులు ఇస్తుంది. కానీ ఈ కంపెనీ మాత్రం నిద్రపోవడానికి ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది విని మీరే కాదు.. సదరు కంపెనీ ఉద్యోగులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఆఫీసుకి వెళ్తామని నిద్రలేచి చూసేసరికి కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ఇక అది చూసి ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఎక్కడ ఉందో తెలుసా? మన బెంగళూరుకి చెందిన వేక ఫిట్ కంపెనీ. ఇంతకీ సెలవు ఎందుకు ఇచ్చిందంటే.. మార్చి 17న ప్రపంచ నిద్ర దినోత్సవం. అందుకే తమ ఉద్యోగులకు నిద్రపోమ్మని సెలవు ఇచ్చేసింది.


నిద్రలేమి వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. మధుమేహం దగ్గర నుంచి గుండె జబ్బుల వరకు తగినంత నిద్రలేకపోవడం కారణమవుతుంది. నిద్ర ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచి నిద్ర రుగ్మతల బారిన పడకుండా ఉండేందుకు ఏటా మార్చి మూడో శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేక్ ఫిట్ తన ఉద్యోగులకు గిఫ్ట్ ఆఫ్ స్లీప్ ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంపెనీ ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది.


‘ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేక్ ఫిట్ ఉద్యోగులందరికీ మార్చి 17, 2023 న సెలవు దినం మంజూరు చేస్తున్నాం. మీరు విశ్రాంతి తీసుకోవడానికి వారాంతానికి ఇదొక మంచి ఆవకాశం’ అని మెయిల్ లో పేర్కొంది. శని, ఆదివారాలు కలిసి రావడంతో ఆ కంపెనీ  ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవు వచ్చేశాయి. నిద్రపోయేందుకు ఇలా సెలవు ఇవ్వడం ఇదేమి మొదటి సారి కాదండోయ్. ఆ కంపెనీలో మరొక రూల్ కూడా ఉంది.


మధ్యాహ్నం కాసేపు కునుకు..


వేక్ ఫిట్ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 వరకు నిద్రపోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో కంపెనీలోని ఉద్యోగులందరూ ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా నిద్రపోతారు. అరగంట పాటు నిద్రపోయే హక్కుని అధికారికంగా ఇస్తున్నట్టు గతంలోనే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.


కాసేపు కునుకు మంచిదే..


మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే ఉద్యోగుల పనితీరు బాగుంటుందని నాసా, హార్వర్డ్ తమ అధ్యయనాల్లో వెల్లడించింది. కాసేపు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయని తెలిపింది. ఏది ఏమైనా ఆ కంపెనీ ఉద్యోగులు భలే లక్కీ కదా.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ ఫుడ్ కాంబినేషన్‌తో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది, నాజూకు శరీరం మీ సొంతం