బరువు తగ్గే ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అదనపు కేలరీలు కరిగించేస్తుంది. పిండి పదార్థాలు తగ్గించడం ఒక్కటే బరువుని తగ్గించుకోవడానికి మార్గం కాదు. వ్యాయామం, ఆహార ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే తీసుకుంటే ఆహారం సరైన విధంగా ఉండాలి. అప్పుడే బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కొన్ని ఆహారాల కాంబినేషన్ బరువు తగ్గించేందుకు బాగా సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


శరీర అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటాయి. వయస్సు, లింగం, శరీర బరువు, ఇతర అవసరాల ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. అందుకే శరీరానికి సరిపడే విధంగా పోషకాలు ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి. అటువంటి జాబితా ఇక్కడ ఉంది. ఈ ఆహారాలు కలిపి తీసుకుంటే మీకు పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఆహారాలను కలిపి తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.


ఆకుకూరలు: బచ్చలికూర, కాలే ఆకుపచ్చని ఆకుకూరల్లో పోషకాలు నిండుగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటితో అవకాడో కలిపి తీసుకుంటే ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. పోషకాలని శరీరానికి అందించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.


గ్రీన్ టీ, నిమ్మకాయ: బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి గ్రీన్ టీ ఆరోగ్యకరమైన ఎంపిక. కాస్త రుచి ఘాటుగా చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కేలరీలను బర్న్ చేయడం వేగవంతం చేస్తాయి. తక్కువ కేలరీలు ఉండే ఈ పానీయం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ C పుష్కలంగా ఉండే నిమ్మకాయని అందులోకి చేర్చడం వల్ల మరింత ఆరోగ్యకరమైన పానీయంగా మారుతుంది.


పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వు: సీజన్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం చాలా ముఖ్యం. ఇక ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన నూనెగా ప్రసిద్ధి చెందింది. కాస్త ఖరీదు ఎక్కువైనప్పటికీ గుండెకి మేలు చేసే నూనెల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నూనెని కూరగాయాలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియని మరింత వేగవంతం చేస్తుంది.


బెర్రీస్, ఓట్మీల్: ఓట్స్ బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన అల్పాహారానికి చక్కని ప్రత్యామ్నాయం. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. బెర్రీలతో చేసుకున్న ఓట్మీల్ తో బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. అదనపు కొవ్వుని తగ్గించడంలో సహాయపడే పండ్లలో బెర్రీలు కూడా ఒకటి.


చియా సీడ్స్ పుడ్డింగ్: సబ్జా గింజలు మాదిరిగా కనిపించే చియా సీడ్స్ పోషకాలు ఎక్కువ. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. అధిక పీచు పదార్థం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్ ఇస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: వైట్ వెనిగర్‌తో వంటకు రుచి మాత్రమే కాదు, మీ కిచెన్ తళతళా మెరిసేలా చేసేయొచ్చు