Work From Home Ends:


రిటర్న్ టు ఆఫీస్..


ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌ మొదలు పెట్టాయి. వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆప్షన్‌ను పక్కన పెట్టేసి ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పంపుతున్నాయి. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ఉద్యోగులకు ఈ సూచన చేశారు. ఎంప్లాయిస్  అందరూ ఒక్కచోట కలిసి పని చేయాలని చెబుతున్నారు. మెటాతో పాటు అమెజాన్, స్టార్‌బక్స్, వాల్ట్ డిస్నీ కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రొడక్టివిటీ తగ్గిపోతోందని చెబుతున్నాయి ఈ కంపెనీలు. ఆఫీస్ ఆక్యుపెన్సీ 50% కన్నా ఎక్కువగా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి గతేడాదే చాలా కంపెనీలు ఆఫీస్‌లకు వచ్చేయాలంటూ ఉద్యోగాలకు ఆదేశాలు పంపాయి. కానీ ఉద్యోగులెవరూ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. రిటర్న్ టు ఆఫీస్‌ పాలసీతో ఆఫీస్‌ కల్చర్‌ అందరికీ అలవాటవుతుందని, కంపెనీలకు ఇది చాలా అవసరమని అంటున్నాయి యాజమాన్యాలు. అమెజాన్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. మే 1వ తేదీ నుంచి ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని చెప్పింది. వారానికి మూడు రోజులు ఆఫీస్‌లో అందుబాటులో ఉండాలని తెలిపింది. ఎంత మంది ఆఫీస్‌కు రావాలన్న విషయం మేనేజర్‌లే నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. కలిసి పని చేయడం వల్ల ఉద్యోగుల మధ్య బాండింగ్ పెరుగుతుందని అంటోంది. 


ఉద్యోగులకు పిలుపు


అందరి కంటే ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన మెటా...ఇప్పుడు ఉద్యోగులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కలిసి మెలిసి పని చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని సూచిస్తోంది. ఫ్లెక్సిబిలిటీకి కూడా కొంత హద్దు ఉంటుందని సుతి మెత్తగా హెచ్చరిస్తోంది. స్నాప్ కంపెనీ కూడా వారానికి నాలుగు రోజులు ఆఫీస్‌కు రావాలని చెబుతోంది. స్టార్‌బక్స్ కంపెనీలోనూ వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలన్న నిబంధన విధించారు. కనీసం రెండు రోజులైనా ఆఫీస్‌కు రావాలని వాల్‌మార్ట్ చెబుతోంది. 


భారీ లేఆఫ్‌లు..


మెటా ప్లాట్‌ఫామ్ మరోసారి 10 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితం 11 వేల మందిని తొలగించిన కంపెనీ రెండో రౌండ్‌లోనూ అదే స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపాలనుకుంటోంది. ‘మా బృందం పరిమాణం 10 వేల మందిని తగ్గించనున్నాం, 5000 అదనపు ఉద్యోగుల నియామకం కూడా ఉండదు’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఇప్పటికే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 13 శాతం (11 వేల మంది) ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టనుంది. మెటాలో పునర్నిర్మాణ పనులు విస్తరించడం, తక్కువ ప్రాధాన్యత ప్రాజెక్టులను రద్దు చేయడం, నియామకాల తగ్గింపు వంటి అంశాలు లేఆఫ్‌కు కారణమని కంపెనీ వెల్లడించింది. వార్షికంగా ఖర్చులను 95 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 89 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కుదించాల‌న్న మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఆలోచ‌న‌కు అనుగుణంగానే  ఉద్యోగుల‌ను మెటా తొల‌గిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది.


Also Read: BJP vs Rahul Gandhi: రాహుల్ సారీ చెబితేగానీ మాట్లాడనివ్వం, తేల్చి చెప్పిన బీజేపీ నేతలు