Sudan Clashes : ఆఫ్రికా దేశంలో సూడాన్ లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా దేశంలోని అనేక చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 56 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. బుల్లెట్ గాయమై భారతీయ పౌరుడు మరణించినట్లు సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం తెలిపింది. మిలిటరీ, పారామిలటరీదళాల మధ్య తలెత్తిన ఘర్షణల దృష్ట్యా సూడాన్ లోని భారతీయులను ఇంట్లోంచి బయటకు రావొద్దని భారత రాయబార కార్యాలయం సూచించింది. దేశం "ప్రమాదకరమైన" పరిస్థితుల్లో ఉందని సూడాన్ సైన్యం హెచ్చరించిన రోజుల వ్యవధిలో, పారామిలిటరీ, సాధారణ సైన్యం పరస్పరం వారి స్థావరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖార్తూమ్‌లో పేలుళ్లు సంభవించాయి.
56 మంది మృతి
ఈ ఘర్షణల్లో మొత్తం మరణాల సంఖ్య 56కి చేరుకుందని సూడాన్ వైద్యుల సెంట్రల్ కమిటీ పేర్కొంది. భద్రతా దళాలలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలిపింది. సూడాన్‌లోని దాల్ గ్రూప్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయ పౌరుడు మిస్టర్ ఆల్బర్ట్ అగెస్టీన్ కు బుల్లెట్ తగిలి గాయాలపాలై మరణించాడని భారత ఎంబసీ తెలిపింది. తదుపరి ఏర్పాట్లను చేయడానికి ఎంబసీ... బాధితుడి కుటుంబం, వైద్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని అధికారులు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఘటనపై స్పందించారు. బాధితుడు కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. భారత ఎంబసీ బాధితుడు కుటుంబానికి పూర్తి సహాయాన్ని అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఖార్తూమ్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, మేము పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని జైశంకర్ తెలిపారు. సూడాన్ భారత రాయబార కార్యాలయం ఈ విధంగా ట్వీట్ చేసింది. 'సూడాన్ లో కాల్పులు, ఘర్షణల దృష్ట్యా, భారతీయులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఉండండి, బయటికి వెళ్లడం తాత్కాలికంగా విరమించుకోండి.' అని ఎంబసీ అధికారులు సూచించారు.
మిలటరీ, పారా మిలటరీ కమాండర్ల మధ్య వివాదం
అంతర్జాతీయ వార్త సంస్థల నివేదికల ప్రకారం పారామిలటరీర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)ని సాధారణ సైన్యంలోకి చేర్చడంపై సైనిక నాయకుడు అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్ పారామిలటరీ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉద్రిక్తత మరింత పెరిగి శనివారం సూడాన్‌లో హింస చెలరేగింది. సూడాన్ విమానాశ్రయం సమీపంలో, బుర్హాన్ నివాసం, ఖార్తూమ్ నార్త్‌లో కాల్పుల శబ్దాలు వినిపించాయని నివేదికలో పేర్కొన్నాయి. రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఖార్తూమ్ సూడాన్ చుట్టూ ఉన్న అనేక సైనిక శిబిరాలపై దాడి చేశారని ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నబిల్ అబ్దల్లా AFP కి చెప్పారు. దేశంలో ఘర్షణలు కొనసాగుతున్నాయని, దేశాన్ని రక్షించడానికి సైన్యం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని అన్నారాయన.