Indian American Student: తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికన్ (Indian-American) విద్యార్థి ప్రీషా చక్రవర్తి (Preesha Chakraborty) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మకమైన జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (Johns Hopkins Centre for Talented Youth) పోటీల్లో ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా చరిత్ర సృష్టించింది. 90కి పైగా దేశాల నుంచి 16,000 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికన్ పాఠశాల విద్యార్థిని ప్రీషా చక్రవర్తి ప్రపంచంలోని ప్రతిభావంతమైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకుంది.
కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని వార్మ్ స్ప్రింగ్ ఎలిమెంటరీ పాఠశాలలో ప్రీషా గ్రేడ్ 3 చదువుతోంది. 2023 వేసవిలో జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (CTY) పరీక్షకు హాజరైంది. ఈ పోటీలకు ప్రపంచ నలుమూలల నుంచి వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 90కి పైగా దేశాల నుంచి 16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారందరి వెన్కక్కి తోసి ప్రీషా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
అన్నింటిలో ప్రతిభ
స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(SAT), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్(ACT), స్కూల్, కాలేజ్ ఎబిలిటీ పోటీల్లో ప్రిషా అసాధారణమైన ప్రతిభ కనబరచడంతో ఆమెను పోటీ నిర్వాహకులు సత్కరించారు. 30 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు తమ పరీక్ష స్కోర్‌ల ఆధారంగా ప్రతి సంవత్సరం హై ఆనర్స్ లేదా గ్రాండ్ ఆనర్స్/సెట్‌కి అర్హత సాధిస్తారని అక్కడి మీడియా పేర్కొంది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాలలో ప్రీషా చక్రవర్తి 99వ పర్సంటైల్ సాధించి గ్రాండ్ ఆనర్స్‌ను కైవసం చేసుకుంది. అలాగు గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, రీడింగ్, రైటింగ్‌లలో 250 కంటే ఎక్కువ జాన్స్ హాప్‌కిన్స్ ఆన్‌లైన్, ఆన్-క్యాంపస్ ప్రోగ్రామ్ హాజరై ప్రీషా ఈ ఘనత సాధించింది.
మెన్సా మెన్సా ఫౌండేషన్‌లో జీవిత కాల సభ్యత్వం
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హై-ఐక్యూ సొసైటీకి చెందిన మెన్సా మెన్సా ఫౌండేషన్‌లో ప్రీషా జీవితకాల సభ్యురాలుగా గుర్తింపు పొందింది. ఐక్యూ, మేధాశక్తి పోటీల్లో 98 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన వ్యక్తులకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఇందులో కూడా ప్రీషా సభ్యత్వం సాధించింది. ఆమె గత రికార్డులు సైతం ఘనంగా ఉన్నాయి. తన ఆరో ఏట జాతీయ స్థాయి నాగ్లీరీ నాన్‌వెర్బల్ ఎబిలిటీ టెస్ట్ (NNAT)లో 99 పర్సంటైల్స్ సాధించింది. ప్రీషా చదువులతో పాటు ప్రయాణం, హైకింగ్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ని ఇష్టపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రిషాకు ఇష్టమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే చదువుల్లో అసాధారణమైన ప్రతిభ చాటుతుందని వెల్లడించారు.
విద్యార్థుల అసాధారణ ప్రదర్శన
ప్రీషా ఎంపికపై సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (CTY) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమీ షెల్టన్ స్పందించారు. ఈ పోటీలు పరీక్షలో విద్యార్థుల పనితీరును గుర్తించడమే కాదని, వారిలో ఉత్సుకత, నేర్చుకునే సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారని, విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకోవడానికి, సరికొత్త సవాళ్లను స్వీకరిస్తూ ఇతర మేధావులతో ఆలోచనలు పంచుకునేలా, సరి కొత్తగా ఆలోచించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (CTY)ని1979లో స్థాపించారు. ఇది యువతో సరికొత్త ఆలోచనలకు కేంద్రంగా ఉంటోంది. టెస్టింగ్, ప్రోగ్రామ్‌లు చేపడుతూ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.