Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF 2024)లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లారు. పర్యటనలో భాగంగా జ్యూరిచ్ విమానాశ్రయం (Zurich airport)లో పలువురు భారత ప్రముఖులు వీరికి ఘన స్వాగతం పలికారు. దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర పెవిలియన్‌లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అని ప్రచారం చేయనున్నారు.


వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు 
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 2,800 మందికిపైగా ప్రముఖులు, భారత్‌ నుంచి 60 మంది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం పర్యటన సాగనుంది. ఇందులో పాల్గొనేందుకు బయలుదేరిన తెలంగాణ బృందం జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో దేశానికి చెందిన పలువురు ప్రముఖులను కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడటం సంతోషాన్నిందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మరింత అభివృద్ది చేసేందుకు దావోస్ ను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర బృందానికి సూచించారు. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు.


3 రోజుల దావోస్ పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు 3 రోజులపాటు స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనలో పర్యటిస్తున్నారు. దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాధాన్యతలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ వేదికలో నోవార్టిస్, మెడ్ ట్రానిక్, ఆస్ట్రాజెనికా, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో భేటీ అవుతారు. అలాగే, భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఐఐ, నాస్కామ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరో స్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది.