Animal OTT Release: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘యానిమల్’. ఈ సినిమా స్క్రీన్‌పై మ్యాజిక్ చేసి, చూసిన ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ‘యానిమల్’ను నిర్మించిన ప్రొడక్షన్ హౌజ్‌లలో Cine1 స్టూడియోస్ కూడా ఒకటి. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతుండగా.. ముందు దీని ఓటీటీ రిలీజ్‌కు స్టే ఇవ్వాలని Cine1 స్టూడియోస్.. ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. 2023 చివర్లో విడుదలయిన ‘యానిమల్’.. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరి ఈ మూవీకి నిర్మాణ సంస్థ నుంచి ఎదురైన సమస్య ఏంటని అందరూ ఆశ్యర్యపోతున్నారు.


అగ్రిమెంట్ బ్రేక్..
ప్రేక్షకులకు మాత్రమే కాదు.. మూవీ లవర్స్‌ను కూడా ‘యానిమల్’ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్‌కు లీగల్ ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. సూపర్ కాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (టీ సిరీస్)పై Cine1 స్టూడియెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు ఫైల్ చేసింది. ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ఈ రెండు సంస్థలు కలిపి ‘యానిమల్’ మూవీని నిర్మించాయి. ఇక ఆ అగ్రిమెంట్‌లో ఉన్నట్టుగా ‘యానిమల్’ నుంచి 35 శాతం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, 35 శాతం లాభాల్లో షేర్.. Cine1 స్టూడియోస్‌కు దక్కాల్సి ఉంది. అయితే లాభాల షేరింగ్ విషయంలో అగ్రిమెంట్‌ను టీ సిరీస్ పక్కన పెట్టిందని.. అంతే కాకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి వివరాలను అందించలేదని Cine1 స్టూడియోస్ ఆరోపించింది.


Cine1 స్టూడియోస్ వర్సెస్ టీ సిరీస్..
బాక్సాఫీస్ కలెక్షన్స్, శాటిలైట్, ఇంటర్నెట్ రైట్స్.. ఇలా ‘యానిమల్’కు సంబంధించిన ఏ ఆర్థిక వివరాలు కూడా Cine1 స్టూడియోస్‌కు తెలియకుండా చేశారని టీ సిరీస్‌పై ఆరోపణలు వినిపించారు న్యాయవాది సందీప్ సేఠి. అయితే Cine1 స్టూడియోస్ అస్సలు ‘యానిమల్’ మేకింగ్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని టీ సిరీస్ తరపున న్యాయవాది అమిత్ సిబాల్ వాదించారు. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో ‘యానిమల్’ మేకర్స్ చేసుకున్న అగ్రిమెంట్‌ను కూడా తమ దృష్టికి తీసుకురాలేదని Cine1 స్టూడియోస్ ఆరోపించింది. ఈ మూవీ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ గురించి ఏ సమాచారం లేదని తెలిపింది. 


స్టే పడినట్టే..!
వాగ్వాదాలు పూర్తయిన తర్వాత Cine1 స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు ఒక మాటపై నిలబడే వరకు ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌కు స్టే పడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లలో ఒకటికంటే ఎక్కువసార్లు చూసినవారు కూడా ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. జనవరి 26న ‘యానిమల్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా మొదలయ్యాయి. ఈ మూవీ థియేట్రికల్ వర్షన్ 3 గంటల 21 నిమిషాలు కాగా.. ఓటీటీలో 3 గంటల 30 నిమిషాల నిడివితో విడుదల అవుతుందని కూడా టాక్ వినిపించింది. ఇక Cine1 స్టూడియోస్, టీ సిరీస్ మధ్య ఉన్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూడాల్సిందే.


Also Read: ఈ ఓటీటీలోకే 'పుష్ప 2', 'దేవర' - స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రుముఖ సంస్థ