Shahid Latif: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. పఠాన్ కోట్ దాడికి షాహిద్ లతీఫ్ ప్రధాన సూత్రధారి. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు లతీఫ్‌ను కాల్చి చంపారు. షాహిద్‌పై యూఏపీఏ కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో లతీఫ్ ఒకడు.






పఠాన్‌కోట్ దాడి ఎప్పుడు జరిగింది?
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై 2016లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు. అడవిలో నక్కి, చీకట్లో సైనిక దుస్తుల్లో వచ్చిన నలుగురు ముష్కరులు వైమానిక స్థావరంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. భారత భద్రతా సిబ్బంది వారిని ఎదుర్కొన్నారు. ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. ఐదు గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన   ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు.  


ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌ఎస్‌జీ, స్వాట్ బృందాలు సమన్వయంతో వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. ముష్కరులను మట్టుబెట్టేందుకు  ఐదు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల వద్ద పెద్దఎత్తున ఆర్‌డీఎక్స్, గ్రెనేడ్ లాంచర్ మిషన్, 52 ఎంఎం మోర్టార్లు, ఏకే 47 తుపాకులు, జీపీఎస్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు దేశంలోని వైమానిక స్థావరంపై దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో షాహిద్ లతీఫ్ ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో  లతీఫ్ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు.


లతీఫ్ కంటే ముందు పాకిస్తాన్‌లో పలువురు టెర్రరిస్టులు హత్యకు గురయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని రావల్‌కోట్‌లోని మసీదులో ఉగ్రవాది మహ్మద్ రియాజ్ అలియాస్ ఖాసిమ్ కాశ్మీరి హతమయ్యాడు. గుర్తు తెలియని హంతకుడు అతని శరీరంపై నాలుగు బుల్లెట్లు కాల్చారు. కశ్మీర్‌లో ఐదుగురు సైనికులు మరణాల వెనుక కీలకంగా ఉన్నాడు. భారత సైనికులపై రహస్యంగా దాడి చేసే ఇస్లామిస్ట్ గెరిల్లా నాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. 


భారత్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలో చేరిన సయ్యద్‌ నూర్‌ షాలోబర్‌ పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రాంతంలో ఈ  ఏడాది మార్చి నెల 4వ తేదీ గుర్తుతెలియని ముష్కరుల చేతిలో హతమయ్యాడు. షాలోబర్ కాశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI సహకారంతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవాడు, కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవాడు. ఇదే ఏడాది ఫిబ్రవరి 26న అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజా పాకిస్థాన్‌లో కాల్చి చంపబడ్డాడు. అల్ బదర్ ఒక మతోన్మాద సంస్థ, ఇది కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేది. సయ్యద్ ఖలీద్ రజాను కరాచీలోని తన ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 


2023 ఫిబ్రవరి 22న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో టెర్రర్ బుక్‌గా పేరొందిన ఇజాజ్ అహ్మద్ అహంగర్ హత్యకు గురయ్యాడు. 1996లో కాశ్మీర్ జైలు నుంచి విడుదలైన తర్వాత పాకిస్థాన్‌కు పారిపోయి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లాడు. భారత ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో చేర్చింది.  జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలమ్‌ను 20 ఫిబ్రవరి 2023న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. హిజ్బుల్ ముజాహిదీన్ లాంచింగ్ కమాండర్‌గా పని చేసే వాడు. రావల్పిండిలో కూర్చొని జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులకు లాజిస్టిక్స్, ఇతర వనరులను అందించేవాడు.