అఫ్గానిస్థాన్ లో పరిస్థితులపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉంటోంది. గతంలోనూ ప్రజాస్వామిక దేశంగా మారడానికి అఫ్గాన్ కు తన సహాయక సహకారాలు అందించింది. తాజాగా తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుతో ఆ దేశ ప్రజలకు సహకారం అందించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కీలక ప్రకటన చేశారు. అఫ్గానిస్థాన్ భవిష్యత్తు కోసం ఐక్యరాజ్యసమితిలో భారత్ మద్దతు ఇవ్వడంతో పాటు కీలక పాత్ర పోషిస్తుందని పీటీఐతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.






అఫ్గాన్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని భారత్ వైఖరిని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. గత నెలలో జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో సైతం ఆయన పాల్గొన్నారు. మొదటగా భారతీయులను స్వదేశానికి రప్పించడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ఆ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికా, భారత్ సహా పలు దేశాల బలగాలు వారి పౌరులను స్వదేశాలకు రప్పించేందుకు చేసిన చర్యలను యావత్ ప్రపంచం వీక్షించింది. కానీ చివరికి తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 


Also Read: 9/11 టెన్షన్.. వెనక్కి తగ్గిన తాలిబన్ ప్రభుత్వం..  అందుకు ప్రధాన కారణాలేంటో తెలుసా!


మహ్మద్ హసన్‌ను అఫ్గాన్ నూతన ప్రభుత్వ అధ్యక్షుడిగా తాలిబన్ నేతలు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా అమెరికా ప్రకటించిన అబ్దుల్ ఘనీ బరాదర్‌ను ఉపాధ్యక్షుడు అయ్యారు. పలు దేశాలు అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా విమర్శించాయి. అయితే యుద్ధాన్ని కొనసాగించడం ఇక కోరుకోవడం లేదని.. దాని ఫలితంగానే అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకున్నామని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 


Also Read: నెరవేరిన తాలిబన్ల లక్ష్యం.. అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు.. అధ్యక్షుడు ఎవరంటే..


అఫ్గానిస్థాన్ పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌గా మార్చివేసిన తాలిబన్లు పంజ్ షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అబ్ధుల్ ఘనీ బరాదర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బలగాల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయాడని  ప్రచారం జరిగింది. ఆ వార్తలను బరాదర్ ఖండించారు. తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఉన్నానని ఆడియో సందేశాన్ని విడుదల చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో తమకు ముప్పు పొంచి ఉండే నేపథ్యంలో భారత్ సైతం అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వ చర్యలపై నిఘా ఉంచింది. చైనా, పాక్‌లతో తాలిబన్ల సంబంధాలపై సైతం ఎప్పటికప్పుడూ వివరాలు తెలుసుకుంటోంది.