భారత్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అరుదైన ఘనత సాధించింది.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించనున్నట్లు సమాచారం. వారంలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని దేశాలు డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన టీకాలు తీసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తున్నాయి.
వ్యాక్సినేషన్ పై ప్రశంసలు..
భారత్ లో వ్యాక్సినేషన్ వేగంపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు కురిపించింది. మొదటి 100 మిలియన్ డోసులు పంపిణీ చేయడానికి భారత్ కు 85 రోజులు పట్టగా 650 మిలియన్ల నుంచి 750 మిలియన్ డోసుల మైలురాయిని అందుకోవడానికి 13 రోజులే పట్టిందని ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.
కరోనాపై యుద్ధంలో భారత్ చొరవ పట్ల హర్షం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించింది. ఇప్పటి వరకు దేశంలో 74,38,37,643 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసులు..
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 27,254 మందికి కొవి.డ్ పాజిటివ్ వచ్చింది. ముందు రోజుతో పోల్చితే కేసులు 4.6 శాతం తగ్గాయి. ఈ నెలలో మరణాల సంఖ్య మరోసారి 200కు తగ్గింది. మరో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 3.32 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. 4.42 లక్షల మంది మరణించారు.