అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు రెండు దశాబ్దాల అనంతరం ఉపసంహరించుకున్నాయి. అంతకు కొన్ని రోజుల ముందే తాలిబన్లు అమెరికాకు డెడ్ లైన్ సైతం ఇచ్చారు. అయితే యుద్ధాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావించక పోవడంతో అమెరికా, నాటో బలగాలను వెనక్కి రప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 31తో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటంతో తొలుత తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. ఆపై మహ్మద్ హసన్‌ను అఫ్గాన్ నూతన ప్రభుత్వ అధ్యక్షుడిగా తాలిబన్లు ఇటీవల ప్రకటించుకున్నారు. 


దాదాపు రెండు దశాబ్దాల కిందట సెప్టెంబర్ 11న అమెరికా, మన్‌హాటన్‌లోని ట్విన్ టవర్స్ ను ఆల్ ఖైదా ఉగ్రవాదులు పేల్చివేశారు. ఆ ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇటీవల అఫ్గాన్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించననుందని పలు అంతర్జాతీయ మీడియాలలో కథనాలు వచ్చాయి. ఆ వేడుకలకు పాకిస్తాన్, చైనా, రష్యా, ఇరాన్, ఖతార్ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం అందినట్లు రిపోర్టులు ప్రచురితమయ్యాయి. కానీ నేడు అఫ్గానిస్థాన్‌లో నూతనంగా ఏర్పడిన తాలిబన్ ప్రభుత్వ నేతలు ప్రమాణస్వీకారోత్సవం, తదితర వేడుకలు 9/11 దాడులు జరిగిన రోజు నిర్వహించడం లేదని తేలిపోయింది. అయితే ఇందుకు కారణాలేమిటి అనే దానిపై అంతర్జాతీయంగా పలు దేశాలలో చర్చ జరుగుతోంది.


Also Read: నెరవేరిన తాలిబన్ల లక్ష్యం.. అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు.. అధ్యక్షుడు ఎవరంటే..


9/11 దాడులు జరిగి 20ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తాలిబన్లు ఎలాంటి వేడుకలు నిర్వహించాలనుకోలేదట. ఈ విషయాన్ని అఫ్గాన్ ప్రభుత్వ కల్చరల్ కమిషన్ సభ్యుడు ఇనాముల్లా సమాంగనీ వెల్లడించారు. అంతర్జాతీయ దేశాల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి తాలిబన్లు చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు రష్యా మీడియా రిపోర్ట్ చేసింది. రష్యా నేతలు ఎవరైనా ఆ వేడకకు హాజరవుతారా అనే విషయంపై అధికార ప్రతినిధి క్రెమ్లిన్ స్పందించారు. తమ దేశం నుంచి ఎవరూ అఫ్గాన్ ప్రభుత్వ వేడకలో పాలు పంచుకోవడం లేతని శుక్రవారం స్పష్టం చేశారు.


అఫ్గాన్ లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు అనే ప్రకటన రాగానే దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాపై దాడులు జరిపిన రోజు ప్రమాణ స్వీకారం లాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తాలిబన్ కీలక నేతలు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని సమాచారం. మరోవైపు అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు హత్య చేయగా.. ఇలాంటి సమయంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని తాలిబన్లు భావించారు. కొన్ని రోజుల కిందటే అగ్రరాజ్యం అమెరికా బలగాల్ని ఉపసంహరించుకోగా, అంతలోనే కయ్యానికి కాలు దువ్వితే మొదటికే మోసం వస్తుందని నూతన ప్రభుత్వ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.


Also Read: కెమెరామెన్‌ను రక్షించిన రష్యా మంత్రి.. అంతలోనే ఊహించని విషాదం..