కిమ్ జోంగ్ ఉన్.. మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్నారు. ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న కిమ్.. మరోసారి అణుకార్యకలాపాలను మొదలుపెట్టారు. తాజాగా లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
ఈ ప్రయోగానికి కిమ్ హాజరు కాలేదు. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు.
మిత్రదేశాలకు ముప్పు..
ఈ ప్రయోగాలపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ స్పందించింది. ఇలాంటి శక్తిమంతమైన ఆయుధాలు ఉత్తర కొరియా చేతిలో ఉండటం అమెరికా సహా మిత్రదేశాలకు ప్రమాదకరమని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షలను నిశితంగా గమనిస్తున్నామని ఎప్పటికప్పుడు తమ మిత్ర దేశాలతో మాట్లాడుతున్నట్లు అమెరికా పేర్కొంది.
ప్రస్తుతం ఉత్తర కొరియాపై అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి. అయినప్పిటికీ ఉత్తర కొరియా ప్రయోగాలను ఆపడం లేదు. అయితే క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలపై బ్యాన్ లేనప్పటికీ ఈ తరహా కార్యకలాపాలు ప్రమాదకరమని అమెరికా అంటోంది.
బైడెన్ ఏం చేస్తారు?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో కిమ్ తో పలుమార్లు అణ్వస్త్రాల నిరాయుధీకరణపై చర్చలు జరిపారు. ఆ సమయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన కిమ్.. బైడెన్ రాకతో దూకుడు పెంచారు. బైడెన్ సర్కార్ మాత్రం.. ఉత్తర కొరియాతో అణు చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇప్పటికే అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ విషయంలో బైడెన్ పై ప్రపంచదేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అఫ్గాన్ సంక్షోభానికి బైడెన్ నిర్ణయమే కారణమని విమర్శిస్తున్నాయి. మరి తాజాగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో బైడెన్ పై మరింత ఒత్తిడి పెరిగినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.