ప్ర‌పంచం మొత్తంగా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ మ‌రికొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ భార‌త‌దేశ కాల‌మానం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 14వ తేదీ రాత్రి 10ః30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. యాపిల్ కొత్త ఐఫోన్ల‌తో పాటు మ‌రిన్ని ఉత్ప‌త్తుల‌ను కూడా మ‌న‌ముందుకు తీసుకురానుంది. ఈ ఈవెంట్లో యాపిల్ లాంచ్ చేయ‌నున్న ఉత్ప‌త్తులు ఇవేనంటూ నెట్టింట్లో కొన్ని వార్తలు చక్క‌ర్లు కొడుతున్నాయి. ఆ ఉత్ప‌త్తులపై ఓ లుక్కేద్దాం..


1. ఐఫోన్ 13 సిరీస్
ఐఫోన్ 13 సిరీస్ ఈ ఈవెంట్లో లాంచ్ కావ‌డం అనేది ప‌క్కా. అయితే ఎన్ని ఐఫోన్లు లాంచ్ అవుతాయ‌నేదే ప్ర‌శ్న‌. ఐఫోన్ 12 సిరీస్ త‌ర‌హాలో.. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లాంచ్ అవుతాయా లేదా ఫోన్ల సంఖ్య పెరుగుతుందా, త‌గ్గుతుందా అనే విష‌యం ఉత్కంఠ నెల‌కొంది. 


ఐఫోన్ 13 సిరీస్ లో యాపిల్ కెమెరాను మెరుగు ప‌రిచింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 13 సిరీస్ లో 120 హెర్ట్జ్ ప్రో మోష‌న్ డిస్ ప్లేను అందించ‌నున్నార‌ని లీకులు వ‌చ్చాయి. గ‌తంలో లాంచ్ చేసిన ఐప్యాడ్ ప్రోలో ఇదే త‌ర‌హా డిస్ ప్లేను అందించారు. ఐఫోన్ 12 సిరీస్ లోనే 5జీని అందించారు. కాబ‌ట్టి 13 సిరీస్ లో కూడా 5జీ క‌చ్చితంగా ఉంటుంది.


2. యాపిల్ వాచ్ 7 సిరీస్
ఈ ఈవెంట్లో యాపిల్ వాచ్ 7 సిరీస్ కూడా లాంచ్ కానుంద‌ని తెలుస్తోంది. యాపిల్ ఇప్ప‌టివ‌ర‌కు లాంచ్ చేసిన వాచ్ ల‌న్నీ దాదాపు ఒకే డిజైన్ తో వ‌చ్చాయి. అయితే యాపిల్ వాచ్ 7 సిరీస్ లో మాత్రం డిజైన్ ప‌ర‌మైన మార్పులు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 41ఎంఎం, 45ఎంఎం వేరియంట్ల‌లో ఈ వాచ్ లాంచ్ కానున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో లాంచ్ అయిన వాచ్ ల్లో 40 ఎంఎం, 44 ఎంఎం వేరియంట్ల‌ను అందించారు.


3. యాపిల్ ఎయిర్ పోడ్స్ 3
యాపిల్ అత్యంత చ‌వకైన ఇయ‌ర్ బ‌డ్స్ ను కూడా ఈ కార్య‌క్ర‌మంలో లాంచ్ చేయ‌నుంద‌ని స‌మాచారం. అవే యాపిల్ ఎయిర్ పోడ్స్ 3. గ‌తంలో లాంచ్ అయిన ఎయిర్ పోడ్స్ కంటే వీటి డిజైన్ లో కూడా మార్పులు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


4. సాఫ్ట్ వేర్ అప్ డేట్లు
యాపిల్ ఫోన్లు కొనాల‌నుకునేవారు ఈ ఈవెంట్లో లాంచ్ అయ్యే ఫోన్ల కోసం చూస్తే.. ఇప్ప‌టికే యాపిల్ ఉత్ప‌త్తులు వాడేవారు మాత్రం సాఫ్ట్ వేర్ అప్ డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యాపిల్ ఈవెంట్లో ఐవోఎస్ 15, ఐప్యాడ్ ఓఎస్ 15, వాచ్ ఓఎస్ 8, టీవీ ఓఎస్ 15 కూడా ఈ ఈవెంట్లోనే లాంచ్ అవుతాయ‌ని అంచ‌నా.


Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధార‌ణ‌ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మ‌న‌దేశంలో లాంచ్!


Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచ‌ర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వ‌చ్చేసింది!


Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!