తిరుమలో టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం ఇవాళ ప్రారంభమైంది. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీలను విక్రయించనున్నారు. 


ఆలయాల్లో వినియోగించిన పూలు ఇది వరకు వ్యర్థం అయ్యేవని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మళ్లీ భక్తులకు ఉపయోగపడాలని నిర్ణయం మేరకు అగరబత్తీల తయారీకి సిద్ధపడ్డామని వెల్లడించారు.  దర్శన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. సప్తగిరులకు గుర్తుగా ఏడు బ్రాండ్స్ తో అగరబత్తీలు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.


ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారని సుబ్బారెడ్డి చెప్పారు. వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారు చేయనున్నట్టు వెల్లడించారు. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు.


స్వామి వారి కైంకర్యానికి వినియోగించిన పుష్పాల ద్వారా తయారు చేసిన అతి తక్కువ ధరలకే అగరబత్తీలను విక్రయిస్తున్నారు. సుగంధభరిత అగరబత్తీలు 100 గ్రాములు 45రూపాయలకు విక్రయించగా... పుష్ప పరిమళ భరిత సహజ అగరబత్తులు 100 గ్రాములు 85రూపాయలు విక్రయించే విధంగా టీటీడీ ధరలను నిర్ణయించింది.  


ఎస్వీ గోశాలలో అగరబత్తీల తయారీకి అవసరమైన స్థలం కేటాయించారు. దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తన సొంత ఖర్చులతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని అగరబత్తీల ఉత్పత్తిని ప్రారంభించింది. టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా పుష్పాలను వేరు చేసి వాటిని డ్రైయింగ్‌ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పౌడర్ గా మారుస్తారు.


ఆ పౌడర్ కి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్‌ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తీలు తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్‌ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు.


Also Read: Temple Coconut Auction: కొబ్బరికాయ కావాలా నాయనా? ధర రూ.6.5 లక్షలు మాత్రమే!