భక్తికి హద్దులు లేవు అంటుంటారు. అందులోనూ మన దేశంలో భక్తులకు కొదవే లేదు. పురాణాల్లోనూ భక్త కన్నప్ప నుంచి భక్త రామదాసు వరకూ ఎందరో భక్తులు ఉన్నారు. తాజాగా మరో భక్తుడు ఏకంగా గుడిలో కొబ్బరికాయను వేలంలో రూ.6.5 లక్షలకు దక్కించుకున్నాడు. కర్ణాటకలో ఈ వేలంపాట జరిగింది.
పండ్ల వ్యాపారి..
కర్ణాటక బాగల్ కోట్ జిల్లాకు చెందిన మహవీర్ హరకే ఓ పండ్ల వ్యాపారి. మహవీర్ కు భక్తి బాగా ఎక్కువ. ఇటీవల మలింగరాయ గుడిలో శ్రావణ మాసం చివరి రోజున బీరలింగేశ్వర పండుగ రోజు ఆలయ కమిటీ వేలంపాట నిర్వహించింది. ఆ వేలంపాటలో రూ.6.5 లక్షలకు కొబ్బరికాయను దక్కించుకున్నారు మహవీర్. ఈ కొబ్బరికాయ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని మహవీర్ అంటున్నారు.
పూజలు చేసి..
ఈ మలింగరాయ క్షేత్రంలో శివుడు.. నంది స్వరూపంలో ఉంటాడు. విగ్రహం వద్ద పెట్టి పూజించిన ఈ కొబ్బరికాయను దక్కించుకున్నవారికి అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకే ఈ కొబ్బిరికాయకు వేలంపాటలో భారీ ధర పలుకుతోంది.
ఎన్నో ఏళ్లుగా ఈ కొబ్బరికాయను వేలం వేస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. అయితే ఎన్నడూ ఈ వేలంపాట రూ. వేలు కూడా దాటలేదని తెలిపారు. ఈసారి మాత్రం వేలంపాట రూ.1000కి మొదలై నిమిషాల్లో లక్షలకు చేరిందని కమిటీ హర్షం వ్యక్తం చేసింది.