ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్యా పద్మావతి సోమవారం ఉదయం మరణించారు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజులుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు. భార్య మరణంతో ఉత్తేజ్ కన్నీరుమున్నీరయ్యారు.  పలువురు ప్రముఖులు ఆసుపత్రికెళ్లి ఉత్తేజ్ ను ఓదార్చారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన ఆసుపత్రికెళ్లి ఉత్తేజ్ ను పరామర్శించారు.  ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, జీవితా రాజశేఖర్... తదితరులు కూడా ఆసుపత్రికెళ్లారు. ఉత్తేజ్, ఆయన ఇద్దరు కూతుళ్లు కన్నీంటిపర్యంతమవుతున్నారు. 


ఉత్తేజ్ చేసే ప్రతి పనిలో భార్య పద్మావతి కూడా పాలుపంచుకునేవారు. ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో కూడా ఆమె భాగస్వామ్యం ఉండేది. అలాగే ఆమె ఓ వస్త్ర దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. దాని బాధ్యతలు కూడా పూర్తిగే పద్మావతే చూసుకునేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె మరణించడంతో ఉత్తేజ్ ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. చిరంజీవిని పట్టుకుని అన్నయ్య... అన్నయ్య అంటూ ఉత్తేజ్ రోదిస్తుంటే... అక్కడున్నవాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు. 


శివ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యాడు ఉత్తేజ్. అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు... చేతన, పాట. చేతన బద్రి, చిత్రం సినిమాల్లో బాలనటిగా నటించింది. పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. తరువాత ప్రేమవివాహం చేసుకుని టాలీవుడ్ దూరమైంది. సినీగేయ రచయిత సుద్దాల అశోక తేజ ఉత్తేజ్ కు మేనమామ అవుతారు.