World Election Year : ఇది ఎన్నికల (Elections)నామ సంవత్సరం. మనదేశంతో పాటు 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ చరిత్ర ( World History)లోనే అత్యంత ప్రజాస్వామిక  సంవత్సరంగా నిలిచిపోనుంది. చరిత్రలో ఎఫ్పుడూ లేనట్టుగా మెజార్టీ ప్రపంచ జనాభా ఓటేసే ఏడాది 2024. జనవరి 13న తైవాన్  అధ్యక్ష ఎన్నికలతో ప్రజాస్వామ్యం పండుగ ప్రారంభమౌతుంది. తైవాన్ ఎన్నికల ఫలితాలు.. అమెరికా-చైనా సంబంధాల భవిష్యత్తు తేల్చనున్నాయి. తైవాన్ లో ఎన్నికలు ఉత్కంఠగా మారతాయని భావిస్తున్నారు. అమెరికా, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, యూకే, రష్యా, మెక్సికో, శ్రీలంక, తైవాన్, సౌతాఫ్రికాతో పాటు 27 సభ్య దేశాలున్నఈయూ ఎన్నికలు కూడా ఈ ఏడాదే. స్టాలిన్ తర్వాత సుదీర్ఘకాలం రష్యాలో అధికారంలో ఉన్న నేత పుతిన్.. మరోసారి అధికారంలోకి రావడం లాంఛనమే. బ్రిటన్ లో రిషి సునాక్.. లేబర్ పార్టీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కుంటున్నారు. ఏకంగా 40 దేశాల్లో నాయకత్వ మార్పుకు ఎన్నికలు శ్రీకారం చుట్టనున్నాయి. అంటే ఓ రకంగా ప్రపంచ రాజకీయ నాయకత్వానికి కొత్త రక్తం ఎక్కించినట్టే. 


రెండు భీకర యుద్ధాలు మధ్య 40కిపైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థాయిల్లో ఉన్న దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మన పొరుగుదేసాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోనూ ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు జరగనున్నాయి. 2009లో అధికారంలోకి వచ్చిన షేక్ హసీనాపై బంగ్లాదేశ్ లో అసంతృప్తి ఉంది. పాక్, బంగ్లా ఎన్నికల ఫలితాలు ద్వైపాక్షిక సంబంధాలనే కాదు.. ఇండియా జాతీయ భద్రతకు కూడా కొత్త సవాళ్లు విసరొచ్చు. బ్రిటన్ లో రిషి సునాక్ గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే అక్కడ మూడేళ్లలో ముగ్గురు ప్రధానులు మారారు. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత సునాక్ వచ్చారు. సునాక్ కు కష్టాలు తప్పడం లేదు. సొంత పార్టీలోనే ఆయన విధానాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. రైట్ వింగ్ కు, మధ్యేవాదులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ముఖ్యంగా వలసల విషయంలో సునాక్ నిర్ణయం తీసుకోవడం సంక్లిష్టంగా మారింది. 


ధనిక దేశాలైన అమెరికా, యూకే, బలహీన దేశమైన సౌత్ సూడాన్, రష్యా, ఇరాన్ లాంటి నిరంకుశ దేశాలు, తైవాన్, ఉక్రెయిన్ లాంటి సంఘర్షిత దేసాలు, ఇలా అన్నిచోట్లా ఎన్నికలైతే జ రుగుతున్నాయి. కాకపోతే కొన్నిచోట్ల ఎన్నికలు బాగా స్వేచ్ఛగా జరగొచ్చు. మరికొన్నిచోట్ల పరిమిత స్వేచ్ఛతో జరగొచ్చు. కానీ ఎన్నికలంటూ జరగటం కచ్చితంగా ప్రజాస్వామ్యానికి శుభ సంకేతమే. ఉదారవాద ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డ పరిస్థితుల్లో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగనుండటం ఆసక్తికరంగా మారింది. ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు ఉన్న పలు దేశాలు ఎన్నికల క్రతువులో పాలుపంచుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో పేరుకే ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యంలోకి నియంతృత్వం చొరబడుతోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రజాస్వామ్యానికి ఇంకా దీర్ఘాయువు ఉందనే ఊరట ఇస్తూ.. రికార్డు స్థాయిలో పలు దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న ఏడాదిగా 2024 చరిత్ర కెక్కనుంది. ప్రపంచానికి అవసరమైనప్పుడల్లా కొత్త నాయకత్వం వచ్చి తీరుతుంది. ప్రజాస్వామ్యంలో మరింత వేగంగా నాయకత్వ మార్పు జరుగుతుంది. ప్రస్తుత నేతల పాలనా కాలంలో జరిగిన అన్ని ఘటనల్నీ బేరీజు వేసే జనం.. తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో నిర్మొహమాటంగా వెల్లడిస్తారు.


సాధారణంగా అయితే ఎన్నికలు జరిగే ఏడాదిని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కష్ట సమయం నడుస్తోంది.  జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం భయపెడుతోంది. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు మరింత దుష్పరిణామాలకు దారితీస్తాయోమోననే భయాలు లేకపోలేదు. మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. పుతిన్ విజయం లాంఛనమే. ఇక్కడ ఫలితాలు ముందే ఫిక్స్ అవుతాయని, నకిలీ అధ్యక్ష అభ్యర్థుల ఉంటారనే ప్రచారం ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌ వెంట ఎంతమంది రష్యన్లు ఉన్నారన్నదే తేలుతుంది. ప్రపంచంలో 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 40కి పైగా దేశాల్లో జరిగే ఎన్నికలు కేవలం ఆయా దేశాల విధానాలనే కాదు. ప్రపంచ కూటములు, కీలక వేదికలు, ప్రభావిత నిర్ణయాలను మార్చేస్తాయా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. కొన్ని దేశాల ఎన్నికల ఫలితాలు ప్రపంచం గతిని మార్చేస్తాయి.