Sheikh Hasina's Message: 


భారత్‌పై ప్రశంసలు..


బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్ తమకు అన్ని విధాలుగా సహకారం అందించిందని కృతజ్ఞతలు తెలిపారు. 1971లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో తమ కుటుంబానికి భారత్‌ ఆశ్రయం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు షేక్ హసీనా. ఆ యుద్ధంలో ఎంతో మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా..నాలుగోసారీ అధికారంలోకి రానున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఆమెకే మరోసారి ఆ పదవి దక్కనుంది. ఈ సమయంలోనే ఆమె భారత్‌ గురించి సానుకూలంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌తో మైత్రి కొనసాగించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటామన్న సంకేతాలిచ్చారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


"భారతీయులందరికీ నా తరపున కృతజ్ఞతలు. భారత్‌ లాంటి మిత్రదేశం ఉండడం మా అదృష్టం. 1971లో జరిగిన యుద్ధ సమయంలో భారత్ మాకు అండగా నిలిచింది. 1975లో మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయాను. అలాంటి సమయంలో మాకు భారత్‌ ఆశ్రయమిచ్చింది. ఇంత సాయం చేసిన భారత్‌కి నా థాంక్స్"


- షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని




ప్రజాస్వామ్య పాలనే లక్ష్యం..


తన విజయంపైనా ధీమా వ్యక్తం చేశారు షేక్ హసీనా. తమ పౌరుల హక్కుల్ని కాపాడడంలో ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యం కొనసాగేలా చేయడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. 


"మాది స్వతంత్ర దేశం. జనాభా ఎక్కువగా ఉన్న దేశం. ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులకు ప్రాధాన్యతనిస్తాం. ఇదే ప్రజాస్వామ్య పాలన ఇకపైనా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను"


- షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని