America News 2024: నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేది లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలుగా పేర్కొన్న ఆయన.. పజలు మళ్లీ అవకాశం కల్పిస్తే అమెరికాను అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
నవంబర్ ఎన్నికల్లో గెలిచేది తానే అంటున్న ట్రంప్:
అనేక సర్వేలు ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తానే నవంబర్ ఎన్నికల్లో విజయం సాధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 5 ఎన్నికల్లో ఓటమి ఎదురవతుందని తాము అనుకోవడం లేదన్న ట్రంప్.. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం 2028 ఎన్నికల్లో మళ్లీ పోటీలో నిలవబోనని కీలక ప్రకటన చేశారు. తను విజయం సాధిస్తే ఆ విజయం వెనుక ముగ్గురు వ్యక్తుల కృషి ఉంటుందన్న ఆయన.. వారి పేర్లను కూడా చెప్పారు. జూనియర్ కెన్నడీ, ఎలాన్ మస్క్, తులసీ గబ్బార్డ్ తన విజయం కోసం ఎంతో కృషి చేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆరోగ్య రంగం సహా పర్యావరణ అంశాలపై కెన్నడీ కృషి గొప్పగా ఉందన్న డొనాల్డ్.. అమెరికా వ్యాప్తంగా చెత్త తొలగింపులో మస్క్‌ది కీలక పాత్ర అని చెప్పారు. పరిపాలనా పరమైన అనుభవంలో తులసీ ముందుంటారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెరిగిన ఇంధన ధరలను 50 శాతానికి తగ్గిస్తామన్న ట్రంప్.. ఈ నిర్ణయం కార్ల ఓనర్లకే కాక.. దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ అంగీకరిస్తే మరోక డిబేట్‌కు సిద్ధమని కమల ప్రకటన:
కొద్ది రోజుల క్రితం కమలా హారిస్- ట్రంప్ మధ్య జరిగిన తొలి , ఆఖరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో హారిస్ పైచేయి సాధించగా.. మరోసారి వారిద్ధరి మధ్య డిబేట్‌పై చర్చ నడుస్తోంది. మరొక డిబేట్‌లో తాను పాల్గొనబోనని ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేయగా.. కమలా ఆ నిర్ణయాన్ని మార్చుకొని అమెరికన్ల కోసం డిబేట్‌కు సిద్ధం కావాలని సూచించారు. ఈ మేరకు ఆమెకు రెండో డిబేట్ గురించి ఓ క్యాంపైన్‌లో ఎదురైన ప్రశ్నకు కమలా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తొలి డిబేట్‌లో ఆ డిబేట్ సంధానకర్తలు కమలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ట్రంప్ కుమారుడే ఈ ఆరోపణలు చేశారు. సంధానకర్తలు ట్రంప్ మాట్లాడిన ప్రతి విషయంపై ఫ్యాక్ట్ చెక్ అంటూ హడావిడి చేశారని.. కమలా ఏం మాట్లాడినా అడ్డు చెప్పలేదని జూనియర్ ట్రంప్ అప్పుడే దుయ్యబట్టారు. ఈ క్రమంలో అక్టోబర్ 23 నాటి సీఎన్‌ఎన్ నిర్వహించబోయే డిబేట్‌కు దూరంగా ఉండాలని ట్రంప్ నిర్ణయించగా.. తాను సిద్ధంగా ఉన్నానని హారిస్ తెలిపారు. ట్రంప్ మాత్రం కారణాలు వెతుక్కొని మరీ పారిపోతున్నారంటూ విమర్శించారు.
నేషనల్ సర్వేల్లో మరోసారి కమలా ముందంజ:
కొన్నివారాల క్రితం విడుదలైన ఎన్‌బీసీ సర్వేల్లో ముందంజలో కనిపించిన హారిస్.. ఈ సారి కూడా ఐదు పాయింట్లతో ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. ట్రంప్ పక్షాన 40 శాతం మంది అమెరికన్లు మాత్రమే నిలిస్తే.. కమలా హారిస్‌కు 48 శాతం జైకొట్టినట్లు తెలిపిన ఎన్‌బీసీ.. ఎర్రర్ మార్జిన్ కింద ఒక మూడు శాతాన్ని తొలగించినా కనీసం ఐదు పాయింట్లతో కమలా ముందు నిలిచారని ఎన్‌బీసీ వెల్లడించింది.
ఏకైన ముస్లీం మేయర్ మద్దతు ట్రంప్‌నకే:
మిషిగన్‌లో హ్యామ్‌ట్రామ్క్ నగరానికి మేయర్‌గా ఉన్న ముస్లిం వ్యక్తి.. అమిర్ గలీబ్ తన మద్దతును ట్రంప్‌నకు ప్రకటించారు. ఎవరు ఏమనుకున్న ట్రంప్ మాత్రం గొప్ప వ్యక్తని అమీర్ పేర్కొన్నారు. అమిర్ తన మద్దతు తెలపడంపై ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవుతారో లేదో పక్కన పెడితే.. కీలక సమయంలో ట్రంప్ వంటి వ్యక్తి అవసరం అమెరికాకు ఉందని గలీబ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.