అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానన్నారు. రిపబ్లికన్‌ యూదు కూటమి వార్షిక సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ప్రయాణ నిషేధం మీకు గుర్తుందా ? తాను రెండోసారి అధ్యక్షుడైన వెంటనే, ముస్లిం దేశాల పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని స్పష్టం చేశారు.  మన దేశంలో బాంబు పేలుళ్లు జరగాలనే కోరుకునే వ్యక్తులు, మన దేశంలోకి ప్రవేశించాలని ఎప్పుడు కోరుకోవద్దని డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే ఈ నిషేధం విధిస్తున్నామన్న ఆయన, గతంలో తమ ప్రభుత్వ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ చర్య అద్భుత విజయం సాధించిందని గుర్తు చేశారు. తన హయాంలో ఒక్క దుర్ఘటన జరగకపోవడానికి చెడు వ్యక్తులను దేశంలోకి అనుమతించకపోవడమే కారణం డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 


ఇరాన్‌, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్‌, ఇరాక్‌, సూడాన్‌ వంటి దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రంప్‌ తన హయాంలో ఆంక్షలు విధించారు. ట్రంప్‌ ప్రకటనను శ్వేతసౌధం తప్పుపట్టింది. ఇస్లోమోఫోబియాకు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్‌ చర్యలు తీసుకున్నారని, ఇదే విధానాన్ని కొనసాగిస్తారని శ్వేతసౌధం ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్‌ విజయం అమెరికాకు ప్రమాదకరమని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ హెచ్చరించారు. లాస్‌ వెగాస్‌లో జరిగిన యూదు రిపబ్లికన్ల సమావేశంలో నిక్కీ హేలీ  మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తే ఆ నాలుగేళ్లు గందరగోళం, కక్ష సాధింపులు, నాటకాలతో సాగుతుందన్నారు. అది అమెరికాకు మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. 


అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సుమారు ఏడాది సమయం ఉండగానే ఎన్నికల వేడి మొదలైంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మళ్ళీ డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ సభ్యుల మద్దతు బలంగా కూడగట్టుకొనే దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకున్నారు. గత మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్స్ ఓడిపోవడంతో రిపబ్లికన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో డోనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీపైనా విమర్శలు చేశారు. కాకపోతే ట్రంప్ నియంతగా, అహంకారిగా,సంపన్నుల పక్షపాతిగా కనిపిస్తాడు. అంతకు మించి శ్వేత జాత్యహంకారం, మిగిలిన జాతుల పట్ల వివక్ష ట్రంప్ లో పతాకస్థాయిలో కనిపిస్తాయి. జో బైడెన్ ఆ పార్టీ పేరుకు తగ్గట్టుగా ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తాడు.


అమెరికాలో జో బైడెన్ రేటింగ్స్ పడిపోవడం, 80 ఏళ్ళ దాటడం వంటి అంశాలు డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా మారాయి. మొన్నటి మిడ్ టర్మ్ ఎన్నికల ముందు ట్రంప్‌పై ఎదురుదాడికి దిగడం డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది. జో బైడెన్ పాలనలోని ప్రతి తప్పటడుగును ట్రంప్ చాలా సునిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ పాలన గొప్పగా లేకపోయినా, నేటి బైడెన్ పాలన అద్భుతంగా ఉందని చెప్పడానికి వాతావరణం పెద్దగా కనిపించడం లేదు.  పిచ్చిచేష్టలు, కోవిడ్ కష్టాలు మొదలైనవి ట్రంప్ పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకతను రగల్చడంతో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవ్వక తప్పలేదు. ట్రంప్ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు. 


మరోవైపు వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు వేగంగా దూసుకొస్తున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిధులు అర్థించడాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిత్వ పోటీదారు వివేక్‌ రామస్వామి తప్పుబట్టారు. అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే నిధుల్లో కోత విధిస్తానని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ 11 ప్రతిపక్ష పార్టీలను నిషేధించిన దేశమన్న ఆయన, అన్ని మీడియా సంస్థలను కలిపి ప్రభుత్వ మీడియాగా మార్చేసిన దేశమంటూ విరుచుకుపడ్డారు. అమెరికా నిధులు ఇవ్వకపోతే సాధారణ ఎన్నికలను నిర్వహించబోనని జెలెన్ స్కీ చెప్పడంపై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.