గాజా నగరంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ప్రతి నిమిషానికో బాంబు వేస్తూ నగరాన్ని నేలమట్టం చేస్తోంది.  వరుస బాంబులతో విరుచుకుపడుతుండటంతో వేల భవనాలు నేలమట్టం అవుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్‌, ఆకాశం, సముద్రం నుంచీ భారీగా దాడులు చేస్తోంది. భూతల దాడులను హమాస్‌ ప్రతిఘటిస్తుండటంతో వీధి పోరాటాలు మొదలయ్యాయి. గాజాలో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియనంతటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నగరంలోని లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  గాజాలోని పలు ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్‌ దళాలు దూసుకెళ్లిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. 


ఇజ్రాయెల్‌ సైన్యానికి, హమాస్‌ మిలిటెంట్లకు మధ్య వీధి పోరాటాలు కొనసాగుతున్నట్లు హమాస్‌ మీడియా వెల్లడించింది.  యుద్ధ విమానాలు 150 హమాస్‌ సొరంగాలు, బంకర్లపై దాడులు చేశాయి. గాజా నగరం వైమానిక దాడులతో దద్దరిల్లింది. తాజాగా 377 మంది పాలస్తీనీయులు మరణించారు. 1,700 మంది భవనాల శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాడులతో గాజాలో తమ ఇంటర్నెట్‌, మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ సర్వీసులన్నీ నిలిచిపోయాయని పాలస్తీనా టెలికం సంస్థ పాల్‌టెల్‌ ప్రకటించింది. ఈ నెల 7వ తేదీన ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా 7,700 మంది గాజావాసులు మరణించారని హమాస్‌ వెల్లడించింది.


మరోవైపు శ్మశానాలకు మృతదేహాలు పోటెత్తుతున్నాయి. గుర్తు తెలియని శవాలు భారీగా వస్తుండటంతో సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృత దేహాలకు అంతిమ సంస్కారాలనూ సరిగా చేయలేని దుస్థితి నెలకొంది. శ్మశానాలకు దుప్పట్లలో చుట్టిన, సంచీల్లో ఉంచిన మృత దేహాలు వస్తున్నాయి. మధ్య గాజాలోఓ జర్నలిస్టు ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన 32 మంది తన కుటుంబ సభ్యులకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బంధువులందరితో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. అక్కడా దాడులు జరగడంతో ఇప్పుడు బంధువులంతా చనిపోయారు. వారి మృతదేహాలను లారీలో తీసుకొచ్చి అంతిమ సంస్కారాలను చేశారు. ఇజ్రాయెల్‌ బాంబు దాడులు జరుగుతాయన్న భయంతో అంతా హడావుడిగా పూర్తి చేశారు.


గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ డిమాండు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడుల వెనుక పాశ్చాత్య దేశాల కుట్ర ఉందన్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులను తీవ్రతరం చేయడాన్ని ఎర్డోగాన్ తప్పు పట్టారు. మరోసారి మహిళలు, చిన్నారులు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని, మానవ సంక్షోభం మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇజ్రాయెల్‌ దాడులను వెంటనే ఆపేయాలని హెచ్చరించారు. ఎర్డోగాన్‌ పార్టీ కార్యకర్తలు ఇస్తాంబుల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నేరస్థురాలిగా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడుతున్నారు. ఏ దేశానికైనా తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని, కానీ ఈ ఘర్షణలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. అటు బ్రిటన్‌ రాజధాని లండన్‌లోనూ వేల మంది పాలస్తీనా మద్దతుదారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. థేమ్స్‌ నది ఒడ్డున వారు బాణసంచాతో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపారు. బ్రిటన్‌లోని ఇతర నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి. పాకిస్థాన్‌, ఫ్రాన్స్‌లోనూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు.