ఫేస్‌బుక్‌ స్నేహితుడి కోసం పాకిస్థాన్‌ వెళ్లిన భారతీయ మహిళ అంజు  త్వరలోనే భారత్ కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. పాకిస్తాన్ వెళ్లిన తర్వాత ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు చెందిన 29 ఏళ్ల నస్రుల్లాను, గత జులై 25న అంజు వివాహం చేసుకున్నారు. దానికి ముందు ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు. 


ఎన్వోసీ రాగానే భారత్ కు అంజూ
ఆగస్టులో ఆమెకు పాక్‌ ప్రభుత్వం ఏడాది చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసింది. తన పిల్లలు పదే పదే గుర్తుకు వస్తుండటంతో ఇండియా రావాలని భావిస్తోంది. పాక్‌ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం రాగానే ఆమె భారత్‌లో పర్యటిస్తారని ఆమె పాకిస్థాన్‌ భర్త నస్రుల్లా వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌వోసీ కోసం ఇస్లామాబాద్‌లోని హోంశాఖకు దరఖాస్తు చేశామని తెలిపారు. భారత్‌లో తన ఇద్దరు పిల్లలను కలుసుకుని, క్షేమ సమాచారాలు తెలుసుకున్నతర్వాత తిరిగి అంజు పాకిస్థాన్‌కు చేరుకుంటుందన్నారు. ఈ వ్యవహారానికి ముందు రాజస్థాన్‌కు చెందిన అర్వింద్‌తో ఆమెకు మొదటి పెళ్లి జరిగింది. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.


పిల్లల మీద బెంగతోనే ఇండియాకు
అంజూకు కొంతకాలంగా పిల్లల మీద బెంగ పెరిగిపోయినట్లు పాకిస్తాన్ భర్త నస్రూల్లా వెల్లడించారు. పిల్లలను చూసేందుకు త్వరలోనే ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ మానసిక వేదనతో సతమతం అవుతోందని, తన పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు పాక్‌లో ఆమెను పెళ్లాడిన నస్రుల్లా తెలిపాడు. వచ్చే నెలలో భారత్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్‌లో డాక్యుమెంటేషన్ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, అది పూర్తయిన తర్వాత ఇండియాకు వెళ్తుందన్నాడు. వీసా మంజూరైతే తాను కూడా ఇండియా వెళ్తానన్నాడు. కొన్ని రోజులుగా అంజూ మానసిక వేదనకు గురవుతోందని, తన పిల్లలను కోల్పోతున్నానన్న భావన ఆమెకు ఉందన్నాడు నస్రుల్లా. ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడం...తమ కుటుంబానికి ఇష్టం లేదని చెప్పాడు. అంజూ తన పిల్లలను చూసుకోవడానికి ఇండియాకు వెళ్లడమే మంచిదన్నాడు. ఆమె ఆరోగ్యం బాగుండాలంటే భారత్‌కు తిరిగి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదన్నాడు. అంజూకు మొదటి పెళ్లి ద్వారా ఇద్దరు పిల్లలు జన్మించారు. 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. పాక్‌లో వివాహం తర్వాత అంజూ పేరు ఫాతిమాగా మారింది. అంజూ పాకిస్తాన్ వెళ్లిపోయిన తర్వాత భారత్‌లోని ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురయింది. 


పెళ్లి ముందుకు ఫాతిమా పేరు మార్పు
నస్రుల్లాతో వివాహం తర్వాత అంజూ పేరు ఫాతిమాగా మారింది. ఆ జంటకు అక్కడ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని మొహసీన్‌ ఖాన్‌ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. అంజూ సరిహద్దులు దాటి వెళ్లడం, అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వంసీరియస్ గా తీసుకుంది. ఆమె పాకిస్తాన్ వెళ్లడం వెనుక అంతర్జాతీయ కుట్రపై తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించింది. అంజూ తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అంజూ భర్త, సోదరుడు, ఆమె తండ్రి తమ వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంజూ భర్తను ఆయన పని చేస్తోన్న సంస్థ ఉద్యోగంలోనే ఉంచినా.. ఎలాంటి పని అప్పగించలేదు. ఆయన్ను బెంచ్‌కు పరిమితం చేసిందిట. ఆమె సోదరుడు ఉద్యోగం కోల్పోయారు. అంజూ పాకిస్థాన్‌ వెళ్లిపోయిన తర్వాత బౌనా గ్రామంలో నివసించే ఆమె తండ్రిపై గ్రామస్థులు మొదట సానుభూతి చూపించారు. తర్వాత టైలర్ గా పని చేస్తున్నతండ్రికి ఉపాధి దొరకడం కష్టంగా మారింది.