హిందీలో వచ్చిన విక్కీ డోనర్ సినిమా చూశారా ? పోనీ తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన " నరుడా డోనరుడా" అనే సినిమా చూశారా ?.  ఏదీ చూడకపోయినా పర్వాలేదు ఇందులో విషయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది..అదే ఆ సినిమా ఓ స్పెర్మ్ డోనర్ కథ అని.  అందులో హీరో  చాలా మంది పిల్లలకు తండ్రవుతాడు.  కానీ తన భార్యతో మాత్రం పిల్లల్ని కనలేడు. అది సినిమా. అమెరికాలోనూ ఓ విక్కీ డోనర్ ఉన్నాడు. ఆయనకు అసలు భార్యే  దొరకడం లేదట. పెళ్లి చేసుకుందామని ఎంత మందిని అడిగినా నో అంటున్నారట.


అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కైల్ గోర్డీ అనే యువకుడికి ముఫ్పై ఏళ్లు. ఇప్పటికి నలభై ఏడు మంది పిల్లలు ఉన్నారు. ఇంకా పది మంది రేపో మాపో పుట్టబోతున్నారు. కానీ ఆయనకు పెళ్లి కాలేదు. అంటే  తాను స్పెర్మ్ మాత్రం డొనేట్ చేస్తున్నాడన్నమాట. 22 ఏళ్ల వయసులో ఈ స్పెర్మ్ డొనేషన్ స్టార్ట్ చేశారు. ఉచితంగానే సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పటికి అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు వందల్లోనే రిక్వెస్టులు వస్తూ ఉంటాయి. చాలా మంది వివిధ కారణాలతో  కైలే స్పెర్మ్ డొనేట్ చేయమని అడుగుతూంటారు.


అయితే తనను సంప్రదిస్తున్న వారిలో చాలా మందితో ఆయన మాట్లాడారు. ఎవరైనా తన జీవిత  భాగస్వామి అవుతారేమో అని చూసుకున్నాడు. విచిత్రంగా అలాంటి వారు కూడా అతనితో  జీవితం పంచుకోవడానికి సిద్ధపడలేదుట. తనను స్పెర్మ్ డొనేట్ చేయమని అడుగుతున్న మహిళల్లో చాలా మంది బాగా డబ్బున్నవారేనని.. ఏ స్పెర్మ్  బ్యాంకుకు వెళ్లినా వారికి కావాల్సినది దొరుకుతుందని.. కానీ వారంతా తనను రిక్వెస్ట్ చేస్తున్నారన్నారు.  తమకు పుట్టబోయే బిడ్డకు బయోలాజికల్ ఫాదర్ ఎవరో తెలుసి ఉండాలన్న కారణంగానే ఇలా చేస్తున్నట్లుగా ఆయన చెబుతున్నారు.


కైలే  ఎవరి దగ్గర ఒక్క డాలర్ కూడా తీసుకోకుండానే స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు. ఈ సర్వీస్  వల్ల తన జీవితంలో ఎ మహిళా రావడానికి ఇష్టపడటం లేదని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఆయన ప్రపంచ టూర్‌లో ఉన్నారు. ఎందుకంటే.. తన బిడ్డల్ని కలవడానికి. అందర్నీ కలుస్తానంటున్నాడు. విక్కీ డోనర్ సినిమాలో అయితే రహస్యంగా డాక్టర్ అందరితో కలిసి ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు.  దానికి డోనర్‌ని పిలుస్తాడు. ఇక్కడ మాత్రం తానే వెళ్తున్నాడు. అతని త్యాగ నిరతిని మెచ్చి జీవితం పంచుకునే అమ్మాయి.. తన పిల్లల్ని చూసుకునే టూర్‌లో అయినా దొరుకుతుందని ఆశిద్దాం !