ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం 50 బిలియన్ టన్నుల ఇసుక,  కంకరను  ఉపయోగిస్తూంటారు. ప్రజలు నీరు తర్వాత అత్యధికంగా ఉపయోగించేది ఈ సహజవనరునే. ఇప్పుడు నీటి సంక్షోభం అన్ని చోట్లా ఉంది. ఆ తర్వాత ఇసుక, గ్రావెల్ సంక్షోభం రావడం కూడా అంతే సహజమని నిపుణులు చెబుతున్నారు. " ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రాం" (UNEP) ఏప్రిల్ 26న భారత్‌లో ఇసుక వెలికితీత, వినియోగంపై ఒక నివేదికను విడుదల చేసింది. ఇసుకను 'వ్యూహాత్మక వనరు'గా వర్గీకరించడం, ఇసుక వనరులను మ్యాపింగ్ చేయడం, పర్యవేక్షించడం, ఇసుక అక్రమాలను ఎదుర్కోవడం వంటి సిఫార్సులను ఈ నివేదికలో చేసింది.   


పర్యావరణ సమస్య ప్రధానంగా ఉన్న భారతదేశానికి ఇసుక వెలికితీత అనేది మరో కీలకమైన సమస్య. చట్టపరమైనమైనవైనా..  అక్రమం అయినా ఇసుక తవ్వకాలు నదీ తీరాలను అస్థిరపరుస్తాయి. వరదలకు ఎక్కువ అవకాశం కల్పిస్తాయి. వేగవంతమైన పట్టణీకరణ , రియల్ ఎస్టేట్ పెరుగుతూండటం వల్ల ఇసుకకు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది.  అక్రమ మైనింగ్ చేసే వరూ వ్యవస్థీకృతంగా మారిపోయారు. ఈ మాఫియాలు  నదులు తీరాల నుండి ఇసుక వెలికితీతను పర్యావరణానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. వీరిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఎదురు తిరిగితే చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలా అడ్డుకునే ప్రయత్నాల్లో అనేక మంది జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 2019లో ఇసుక లభ్యతలో అమెరికా అగ్రస్థానంలో, భారత్‌ ఆరో స్థానంలో ఉన్నాయి. వినియోగంలో మాత్రం చైనా ప్రథమ స్థానంలో, ఇండియా రెండో స్థానంలో ఉన్నాయి. ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరగడం.. 21వ శతాబ్దపు సమస్యల్లో ఒకటిగా మారింది. శరవేగంతో పరుగులు తీస్తున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణలవల్ల ప్రపంచ మౌలిక సదుపాయాల రంగం వేగంగా పురోగమిస్తోంది. నిర్మాణాలకు ఇసుక అవసరం గణనీయంగా పెరుగుతోంది. ఇసుక అందుబాటుతో పోలిస్తే వినియోగం అధిక స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక (2019) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నీటి తరవాత అత్యధిక వాడకం ఇసుకదే కావడంవల్ల- రానున్న రోజుల్లో పర్యావరణానికి ఇది తీవ్ర విఘాతం కలిగించనుందని తక్షణమే తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని  ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 
   
ఇసుక తవ్వకాల వల్ల ప్రక్రియ నదుల భౌగోళిక స్వరూపాలను, నీటి ప్రవహాల గమనాలను మారుస్తుంది. ఫలితంగా, వరదలు, కరవు సంభవించే ప్రమాదం ఉంది. నదుల పరీవాహక ప్రాంతాల్లో సారవంతమైన మృత్తిక కోతకు, భూక్షయానికి దారి తీసి, పంటల దిగుబడి తగ్గుతుంది. మంచినీటి, సముద్ర మత్స్య, జల పర్యావరణ, వన్య జాతుల వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లుతుంది. ఆనకట్టల పునాదుల స్థిరత్వం దెబ్బతిని, వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.  సమర్థమైన విధానం, ప్రణాళిక, నియంత్రణ, నిర్వహణ లేకుండా- ప్రపంచంలో ప్రజలందరి అవసరాలను తీర్చడానికి కావలసిన పరిమాణంలో ఇసుకను సేకరించడం, అందించడం చాలా క్లిష్టతరమైన సమస్య అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ నివేదిక (2019) పేర్కొంది. అందుకే ఇసుకకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకవలసిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.