ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆఖరి బంతి వరకు తగ్గేదే లే అంటూ మ్యాచులు ఆడుతోంది. ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ప్రత్యర్థులను వణికిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచుకు ముందు హార్దిక్ సేన బయో బుడగలో ఎంజాయ్ చేసింది. కేజీఎఫ్-2 వీక్షించింది. ఆర్సీబీ మ్యాచులో కేజీఎఫ్ ప్రేరణతో ఆడతామని అంటోంది.
గుజరాత్ టైటాన్స్ బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. వరుసగా వికెట్లు పడుతున్నా విజయం అందుకుంది. 196 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ వరుస సిక్సర్లు బాదేసి అద్భుతం చేశారు. ఈ మ్యాచ్ తర్వాత టైటాన్స్‌కు కాస్త విరామం దొరికింది. ఈ టైమ్‌లో జట్టంతా కలిసి సరదాగా గడిపింది. తమ బయో బుడగలోనే కేజీఎఫ్ సినిమా చూసింది.
మూవీ చూస్తున్నంత సేపు హార్దిక్ పాండ్య చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశాడు. విదేశీ ఆటగాళ్లు సైతం సినిమాను ఆస్వాదించారు. ఆఖర్లో మూవీ చాలా బాగుందంటూ చెప్పారు. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మాతృక మాత్రం కర్ణాటకదే. ఆర్సీబీ మ్యాచుకు ముందే గుజరాత్ టైటాన్స్ ఈ సినిమా చూడటం యాదృచ్ఛికం! పైగా బెంగళూరుపై కేజీఎఫ్ ప్రేరణతో ఆడతామని ట్వీట్లు చేసింది.
గ్రేట్ ఫినిషింగ్ టచ్!
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ (GT) ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి పేపర్‌పై చూస్తే వారి కాంబినేషన్ సెట్టవ్వలేదు. ఓపెనింగ్ పెయిర్ బాగాలేదు. మిడిలార్డర్లోనూ అదే పరిస్థితి. బౌలింగ్‌లో మాత్రం తిరుగులేదు. మొదటి మ్యాచులో వచ్చిన మూమెంటమ్‌ను అందిపుచ్చుకొని వరుస విజయాలు అందుకుంటున్నారు. ఒక్కో మ్యాచులో ఒక్కొక్కరు నిలబడుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా హార్దిక్ పాండ్యపై ఆధారపడుతున్నా మిగతా వాళ్లు మ్యాచుకు తగ్గట్టు ఆడుతున్నారు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో ఆఖరి బంతికి విజయాలు అందుకుంటున్నారు. షమి, ఫెర్గూసన్, రషీద్, అల్జారీ జోసెఫ్ బౌలింగ్ బాగుంది.