GT vs RCB Preview: ఐపీఎల్ 2022లో 43వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. బ్రబౌర్న్ మైదానం (Brabourne Stadium) ఇందుకు వేదిక. హార్దిక్ పాండ్య (Hardik Pandya) సారథ్యంలోని గుజరాత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గెలిపించే వనరులున్నా ఆర్సీబీ మాత్రం డీలా పడుతోంది. మరి ఈ మ్యాచులో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
గ్రేట్ ఫినిషింగ్ టచ్!
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ (GT) ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి పేపర్‌పై చూస్తే వారి కాంబినేషన్ సెట్టవ్వలేదు. ఓపెనింగ్ పెయిర్ బాగాలేదు. మిడిలార్డర్లోనూ అదే పరిస్థితి. బౌలింగ్‌లో మాత్రం తిరుగులేదు. మొదటి మ్యాచులో వచ్చిన మూమెంటమ్‌ను అందిపుచ్చుకొని వరుస విజయాలు అందుకుంటున్నారు. ఒక్కో మ్యాచులో ఒక్కొక్కరు నిలబడుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా హార్దిక్ పాండ్యపై ఆధారపడుతున్నా మిగతా వాళ్లు మ్యాచుకు తగ్గట్టు ఆడుతున్నారు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో ఆఖరి బంతికి విజయాలు అందుకుంటున్నారు. షమి, ఫెర్గూసన్, రషీద్, అల్జారీ జోసెఫ్ బౌలింగ్ బాగుంది.
మిడిలార్డర్లో ఇబ్బంది
గొప్పగా మొదలు పెట్టడం మధ్యలో తడబడటం ఆఖర్లో చేతులెత్తేయడం ఆర్సీబీ ఆనవాయితీగా వస్తోంది! ఈ సీజనూ మినహాయింపేమీ కాదు. మొదట్లో గొప్పగా ఆడిన బెంగళూరు ఇప్పుడు తడబడుతోంది. ఓపెనింగ్ క్లిక్ అవ్వడం లేదు. మిడిలార్డర్లోనూ తడబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్ విఫలమవ్వడం కలచివేస్తోంది. చిన్నచిన్న భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతున్నారు. డీకే మాత్రం ఫర్వాలేదు. ఇకపై వరుస విజయాలు కావాలంటే మాత్రం బ్యాటింగ్ క్లిక్ అవ్వాలి. బౌలింగ్ మాత్రం బాగానే ఉంది. జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, హసరంగ, సిరాజ్ వికెట్లు తీస్తూ న్యాయం చేస్తున్నారు.
GT vs RCB Probable XI
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, యశ్ దయాల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, ప్రభుదేశాయ్ / మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్