Namibia : దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు ఆ దేశం కఠిన నిర్ణయం తీసుకుంది. తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక అలమటిస్తున్న ప్రజల ప్రాణాలను రక్షించుకునేందుకు ఆఫ్రికా ఖండానికి చెందిన నమీబియా దేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. కరవు ప్రభావంతో ప్రజలు అలమటిస్తున్న నేపథ్యంలో వారి ఆకలి తీర్చేందుకు అటవీ జంతువులను వధించి కడుపు నింపాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రపంచంలోనే సంచలనంగా మారింది. గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కరవు ఆ దేశాన్ని పట్టి పీడిస్తుంది. దీంతో ప్రత్యామ్నాయంగా ఆ దేశం అడవుల్లో సంచరించే 700 అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రంగంలోకి ప్రొఫెషనల్ వేటగాళ్లు
నమీబియా దేశంలో గడిచిన శతాబ్దకాలంలో ఎప్పుడూ చూడని కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజలు తిండి, నీరు లేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విధిలేని పరిస్ధితుల్లో ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ అడవుల్లో సంచరించే 700 అడవి జంతువులను చంపి మాంసం పంపిణీ చేయడానికి సిద్ధమైంది. దేశ ప్రజల ఆకలి తీర్చడమే కర్తవ్యంగా 83 ఏనుగులు, 30 హిప్పోలు(నీటి గుర్రాలు), 60 అడవి దున్నలు, 100 బ్లూ వైల్డ్ బీస్ట్, 5- ఇంపాలాలు, 300 జీబ్రాలను వధించడానికి ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ పర్యావరణ అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రొఫెషనల్ వేటగాళ్లను రంగంలోకి దించి అడవి జంతువులను వధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నైరుతి ఆఫ్రికాలోని కరవు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆ ప్రభుత్వం వెల్లడించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడానికి ఇప్పటికే 150 కి పైగా అటవీ జంతువులను చంపి మాంసం పంపిణీ చేశారు.
ఎల్‌నినోతో కరవు
ప్రస్తుత కరవు ప్రభావంతో నమీబియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశ జనాభాలో సగం మంది అంటే.. దాదాపు 14 లక్షల మంది తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వన్యప్రాణులను వధించడం ద్వారా నీటి ఒత్తిడిని అధిగమించడంతోపాటు ప్రజల ఆకలి తీర్చవచ్చని ఆ దేశం భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. గతేడాది కూడా వర్షాభావ పరిస్థితులు కారణంగా నీటి వనరులు లేక వందలాది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. బోట్సువానాలోనూ 1,30,000 ఏనుగులు ఉండేవి. 2014లో అక్కడి ప్రభుత్వం వేటను నిషేధించింది. అయితే, కరువు కారణంగా ప్రజల ఆకలి తీర్చడానికి స్థానికుల ఒత్తిడి మేరకు 2019లో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ప్రపంచ దేశాల వైపు ఆశగా చూస్తున్న నమీబియా ప్రజలు
వర్షాభావ పరిస్తితుల కారణంగా నమీబియాలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఎటు చూసినా కరువు తాండవిస్తోంది. తమను ఆదుకునే వారి కోసం పక్కదేశాల వైపు అక్కడి ప్రజలు ఆశగా చూస్తున్నారు.
Also Read: షాకింగ్ వీడియో! హఠాత్తుగా కుంగిపోయిన రోడ్డు, భారీ గోతిలో కూరుకుపోయిన కార్ - వీడియో