ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడ్డ వారితో కిక్కిరిసిపోయిన గాజా ఆస్పత్రుల్లో త్వరలోనే అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. ఇంధనం కొరతే అందుకు ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు చెబుతున్నాయి. అయితే గాజాకు ఇంధనం సరఫరాను అనుమతించేందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. హమాస్ వద్ద 5 లక్షల లీటర్ల ఇంధనం ఉందని ఫొటోలు విడుదల చేసింది. ఆస్పత్రుల్లో ఇంధనం కోసం హమాస్‌నే అడగాలని ఐరాసకు సూచించింది. ఇంధన సరఫరాకు అనుమతిస్తే అది హమాస్ కాజేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో శిథిలాల గుట్టను తలపిస్తున్న గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది. గాజా ఆస్పత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపోగా.. ఇంధన కొరత కారణంగా అనేక చోట్ల సేవలను నిలిపివేస్తున్నారు. గాజాలోని మొత్తం ఆస్పత్రుల్లో మూడో వంతు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మూడింట రెండో వంతు ఇప్పటికే మూసివేశారు.
సేవలను నిలిపివేస్తాం
ఇంధనం తమకు అందకపోతే గాజాలో తమ సేవలను నిలిపివేస్తామని ఐరాస ఏజెన్సీ UNRWA హెచ్చరించింది. ఇంధన కొరత కారణంగా ప్రాణాలు రక్షించే ఆపరేషన్లు త్వరలోనే నిలిచిపోనున్నాయని దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న ఆస్పత్రులు హెచ్చరిస్తున్నాయి. రక్తం కొరత కూడా తీవ్రంగా ఉందని తెలిపాయి. పెను విపత్తుకు దగ్గర్లో ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ ససేమిరా
అయితే గాజాకు ఇంధనం సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. ఇంధనం పంపిస్తే హమాస్ మిలిటెంట్ సంస్థ దాన్ని కాజేసి తమ మిలటరీ ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజాకు ఇంధన సరఫరాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని చెబుతోంది. హమాస్ వద్ద భారీగా ఇంధన నిల్వలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ఫోటోలను విడుదల చేసింది. ఇంధనం కోసం హమాస్‌ను అడగాలంటూ ఐక్యరాజ్య సమితికి ఇజ్రాయెల్ సూచించింది. హమాస్ వద్ద 5 లక్షల లీటర్ల ఇంధనం ఉందంటూ ఇజ్రాయెల్ ఫోటోలు విడుదల చేసింది.
ప్రస్తుతం రఫా సరిహద్దు గుండా తక్కువ సంఖ్యలోనే ఆహారం, నీరు, ఔషధాలతో కూడిన ట్రక్కులు గాజాకు చేరుతున్నాయి. గాజాకు ఇంధన సరఫరాను మాత్రం ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. ఇంధన సరఫరా విషయంలో ఇజ్రాయెల్ వాదనలో నిజం లేకపోలేదని అమెరికా కూడా ఆ దేశానికి మద్దతుగా నిలుస్తోంది. ఈజిప్టు సరిహద్దుల్లో 4 లక్షల లీటర్ల ఇంధనంతో తమ ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయని ఐరాస వెల్లడించింది. ఆ ఇంధనం రెండున్నర రోజులకు సరిపోతుందని తెలిపింది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసేలా మధ్యవర్తులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బందీల్లో నలుగురిని మాత్రమే హమాస్ విడుదల చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
మరోవైపు, గాజాలో దాదాపు మూడింట రెండొంతుల ఆరోగ్య కేంద్రాలు పని చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాజా వ్యాప్తంగా 72 ఆరోగ్య సంరక్షణా కేంద్రాలకు గాను 46 కేంద్రాలు పనిచేయడం మానేశాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో 35 ఆస్పత్రులకు గాను 12 ఆస్పత్రులు కూడా పనిచేయడం లేదని పేర్కొంది.
ఉత్తర గాజా ప్రజల పరిస్థితి దారుణంగా
ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలతో ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు తరలిపోయిన 11 లక్షల మంది పాలస్తీనా వాసులు మళ్లీ ఉత్తరగాజా బాటపట్టారు. దక్షిణ గాజాలో వసతి సౌకర్యాలు లేక పరిస్థితులు దారుణంగా ఉన్న వేళ మళ్లీ తమ సొంత ఇళ్లకు ఉత్తర గాజా వాసులు పయనమవుతున్నారు. దక్షిణ గాజాలో వసతి, ఆహారం, తాగునీరు కొరతతో పాలస్తీనా వాసులకు దిక్కుతోచడం లేదు. దక్షిణగాజాలోని ఖాన్ యూనిస్ నగరానికి దాదాపు 7 లక్షల మంది తరలిరాగ వారందరికీ ఆశ్రయం దొరకడం లేదు. చాలా మంది ఆస్పత్రులు, క్లబ్‌లు, రెస్టారెంట్లలో తలదాల్చుకోవాల్సి వస్తోంది. అనేక మంది వీధుల్లోనే నిద్రిస్తున్నారు. చాలా మంది రోజుకు ఒక లీటరు నీరే తాగుతున్నారు. ఒకటి, రెండు అరబిక్ రొట్టెలు తిని బతుకుతున్నారు.