Israel Hamas Attack:


హమాస్‌కి టర్కీ మద్దతు..


టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ( Tayyip Erdogan) హమాస్‌కి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ ఉగ్రసంస్థ కాదని, తమ భూమిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న సంస్థ అని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లోనే ఇలా సమర్థించారు. తక్షణమే ఇజ్రాయేల్, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని (Israel Hamas War) ఆపేయాలని పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ కలిసికట్టుగా ఈ సమస్యని పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఇజ్రాయేల్‌పై ఒత్తిడి తీసుకొచ్చి గాజాపై జరుగుతున్న దాడుల్ని నిలువరించాలని అన్నారు. టర్కీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఇజ్రాయేల్ ఈ దాడులకు తెగబడుతోందని మండి పడ్డారు. ఇజ్రాయేల్‌ పర్యటనకు ప్లాన్ చేసినప్పటికీ..ప్రస్తుతం ఆ ఆలోచనను విరమించుకుంటున్నట్టు తెలిపారు. రఫా సరిహద్దు గేట్‌ని (Rafah Border Gate) తెరిచే ఉంచాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే గాజాకి సాయం అందించేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. ఇక హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్లను విడిపించుకోవాలన్నా సరిహద్దు ప్రాంతాల్ని మూసేయకపోవడమే మంచిదని హితవు పలికారు. 


"ఇప్పటికిప్పుడు ముస్లిం దేశాలన్నీ ఒక్కటవ్వాలి. గాజాపై దాడుల్ని నిలువరించాలి. అక్కడి పౌరులు ప్రశాంతంగా జీవించేందుకు చొరవ చూపించాలి. నిజానికి ఇజ్రాయేల్‌ పర్యటన నా షెడ్యూల్‌లో ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలో అడుగు పెట్టాలని లేదు. అందుకే ఆ ఆలోచనను ఉపసంహరించుకుంటున్నాను. రెండు వర్గాలు వెనక్కి తగ్గి దాడులు ఆపేయాలి. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏ చర్యలూ తీసుకోకపోవడం బాధాకరం"


- తయ్యిప్ ఎర్డొగన్, టర్కీ అధ్యక్షుడు 


గాజాపై దాడులు..


ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న బాంబుదాడుల్లో పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. విద్యుత్ సరఫరా కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వివిధ ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల ఆరోగ్యంపై ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనేక మంది శిశువులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని  ఆవేదన చెందుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ విభాగానికి అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భారీ విపత్తు ఎదురవుతుందని గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గాజాస్ట్రిప్‌ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ఇంక్యుబేటర్లలో మొత్తంగా 130 మంది శిశువులు ఉన్నారు. ఒకవేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్, హమాస్ వార్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ సందర్బంగా రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ లో జరిగిన దాడులు దిగ్బ్రాంతిని కలిగించాయన్న ఆయన, హమాస్  దాడులను తీవ్రంగా ఖండించారు.


Also Read: NCERT పుస్తకాల్లో ఇండియాకి బదులుగా 'భారత్‌' పేరు, ప్యానెల్ కీలక నిర్ణయం